జీ-20 సదస్సు ముగిసింది. సమావేశాల అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రన్ తో కలిసి ప్రధాని మోడీ లంచ్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రాన్‌తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నానని మోడీ తెలిపారు. ఆ సమయంలో చాలా అంశాల గురించి చర్చించినట్టు ప్రధాని వెల్లడించారు. భారత్-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు.
ఈ లంచ్ మీటింగ్ లో ప్రధాని మోడీ వెంట విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. మరోవైపు భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు వెల్లడించారు. అంతకు ముందు ప్రధాని మోడీకి మాక్రన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ శాంతిని పెంపొందించేందుకు, దేశాల మధ్య ఐక్యతకు జీ-20 అధ్యక్ష పదవి ద్వారా భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.
మరోవైపు కొమొరోస్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్ అజాలీ అసౌమనీతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అజాలీ అసౌమనీతో ఫలవంతమైన చర్చలు జరిగాయని మోడీ తెలిపారు. జీ-20 కుటుంబంలో చేరినందుకు అసౌమనికి మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత సాగర్ విజన్‌కు కొమొరోస్ చాలా ముఖ్యమైన వ్యక్తి అని ఆయన వెల్లడించారు.
వాణిజ్యంతో పాటు పలు రంగాల్లో సహకారాన్ని పెంపొందించే దిశగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయని ట్వీట్ లో పేర్కొన్నారు. అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో మోడీ సమావేశం అయ్యారు. పలు రంగాల్లో ఇండియా-కెనడాల మధ్య సంబంధాల గురించి చర్చించినట్టు ఆయన తెలిపారు. దీంతో పాటు టర్కీ, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా నేతలతో ప్రధాని మోడీ భేటీ అవుతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.