మహిళా బిల్లు (Mahila Bill) పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మరోసారి గళమెత్తారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో (Parliament special sessions) మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని అన్ని రాజకీయ పార్టీలకు కవిత లేఖ రాశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ లేఖలో కోరారు.
మహిళా బిల్లు చారిత్రక అవసరమని, చట్టసభల్లో సరిపడా మహిళల ప్రాతినిధ్యం ఉంటేనే దేశం పురోగమిస్తుందని లేఖలో కవిత పేర్కొన్నారు.
రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు 47 రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖ రాశారు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మద్దతు పలకాలని కోరారు. మహిళా బిల్లు చారిత్రక అవసరమని, చట్టసభల్లో సరిపడా మహిళల ప్రాతినిధ్యం ఉంటేనే.. దేశం పురోగమిస్తుందని లేఖలో ఆమె అభిప్రాయపడ్డారు.
లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోరారు. లింగ సమానత్వం, సమ్మిళిత పాలనకు మహిళా బిల్లు చాలా కీలకమని.. అయినా, ఆ బిల్లు చాలా కాలం పాటు పెండింగ్లో ఉండిపోయిందన్నారు.
చారిత్రక ముందడుగు వేయడానికి ప్రజాప్రతినిధులకు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఒక మంచి అవకాశం. రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఏకమై అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దేశ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని… అయినా.. చట్టసభల్లో మాత్రం మహిళల ప్రాతినిధ్యం సరిపడా లేదన్నారు. ఇది దేశ పురోగతికి విఘాతం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.