మహారాష్ట్ర(MahaRashtra) లోని థానే(Thane) జిల్లాలో భీవండి(Bhivandi) పట్టణంలో శనివారం అర్థరాత్రి సమయంలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు ఓ చిన్నారి మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..భీవండి పట్టణంలోని దుర్గా రోడ్డులో ఉన్న ఓ రెండు అంతస్తుల భవనం శనివారం అర్థరాత్రి దాటినా తరువాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఇద్దరు మహిళలు చనిపోయారు.
మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి వయసు 8 నెలలు కాగా, మహిళలకు 40 ఏండ్ల వయసు ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.