అమెరికా అధ్యక్షుడు(us president) జో బైడెన్(joe baiden) భారత పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన భారత్ కు వచ్చారు. జీ-20 సమావేశాల్లో పాల్గొన్న ఆయన పలు దేశాల నేతలను కలుసుకున్నారు. జీ-20 నేతలంతా మహాత్మ గాంధీకి(Mahatma Gandhi) నివాళులు అర్పించేందుకు రాజ్ ఘాట్ కు చేరుకున్నారు అక్కడ నేతలకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. రాజ్ ఘాట్ ప్రాముఖ్యత గురించి నేతలకు ఆయన వివరించారు.
అనంతరం జీ-20 నేతలతో కలిసి జాతిపిత మహాత్మ గాంధీకి బైడెన్ నివాళులు అర్పించారు. అనంతరం రాజ్ ఘాట్ లోని శాంతి గోడపై అంతర్జాతీయ నేతలంతా సంతకాలు చేశారు. ఆ తర్వాత వియత్నం వెళ్లేందుకు ఆయన విమానాశ్రయానికి చేరుకున్నారు. బైడెన్ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. జీ-20లో భాగంగా వన్ ఎర్త్ తో పాటు పలు సెషన్స్ లో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోడీతో ఆయన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
సుమారు 50 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగినట్టు ఇరు దేశాల అధినేతలు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య టెలికాం, అంతరిక్షం, పునరుత్పాదక శక్తి, రక్షణ, విద్య రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ భారత్ కు రావడం ఇదే తొలిసారి. ఐరాస భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం విషయంలో అమెరికా నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని బైడెన్ ప్రకటించారు. ఇండియా- మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్ ప్రాజెక్టుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. దీన్ని చారిత్రాత్మక ప్రాజెక్టుగా ఆయన అభివర్ణించారు.
వియత్నాంలో బైడెన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ దేశ నేతలతో ఆయన దైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారు. ఆయన ఘన స్వాగతం పలికేందుకు వియత్నం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు చైనా అధ్యక్షుడు జీ-20 సమావేశాలకు జిన్ పింగ్ హాజరు కాకపోవడంపై ఆయన స్పందించారు. ఈ సమావేశాలకు జీ జిన్ పింగ్ కూడా హాజరై వుంటే బాగుండేదన్నారు.