తెలంగాణ రాజకీయ నేతల్లో మంత్రి చామకూర మల్లారెడ్డిది ప్రత్యేక శైలి. ఆయన మాటలు, చేష్టలు అందరినీ అలరిస్తుంటాయి. వివిధ సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన మల్లా రెడ్డి డాన్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్టేజ్ పైన డీజే టిల్లు టైటిల్ సాంగ్ రాగానే అక్కడున్న వారితో ఆయన హుషారుగా డ్యాన్స్ చేశారు. సినిమాలోని సిగ్నేచర్ స్టెప్పులు వేసి అక్కడున్న వారిని ఉత్సాహ పరిచారు.
డ్యాన్స్‌లో నాకెవ్వరు పోటీ లేరు అంటున్నారు మంత్రి మల్లారెడ్డి. యువకులు కూడా డ్యాన్స్‌లో తనతో పోటీ పడలేరన్నట్లుగా డ్యాన్స్ ఇరగదీశారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా వైద్యులు, యువతతో కలిసి డ్యాన్స్ చేసి వారిని ఉత్సాహపరిచారు. మత్తు పదార్థాలకు బానిసై యువత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు మంత్రి మల్లారెడ్డి. యువత హెల్త్‌పై ఫోకస్ పెంచాలన్నారు. నిత్యం వ్యాయామం, యోగా చేస్తున్న కారణంగానే 70 ఏళ్ల వయసులోనూ ఇలా ఆరోగ్యంగా ఉన్నానన్నారు మల్లారెడ్డి.
పాలమ్మిన పూలమ్మిన అంటూ తన డైలాగ్ చెప్తూ అందరినీ అలరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వ్యాయామం, యోగా, వాకింగ్ లాంటివి చేస్తూ ఉండాలని చెప్పారు. వ్యసనాలను విడనాడి ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని సూచించారు.