మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో (Madapur Norcotics Case) నార్కోటిక్ పోలీసులు ఇవాళ హీరో నవదీప్ (Hero Navdeep) ను విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ విచారణలో నవదీప్ ను రకరకాల ప్రశ్నలు అడిగారని సమాచారం. ఇందులో ఎక్కువ ప్రశ్నలకు నవదీప్ సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు ఆధారాలు చూపించి ప్రశ్నలు అడిగితే…నవదీప్ ఏం మాట్లాడకుండ మౌనంగా ఉంటున్నారని…తాను మాదక ద్రవ్యాలు ఎవరి వద్ద నుంచి కోనుగోలు చేయలేదని మాత్రమే చెప్తున్నారని తెలుస్తోంది. రాంచంద్రతో నవదీప్ జరిపిన లావాదేవీల ఆధారాలను చూపించి పోలీసులు ఈ డబ్బు దేని కోసం పంపావని అడిగితే…అది మాదకద్రవ్యాల కొనుగోలు కోసం కాదని నవదీప్ చెప్తున్నారు. అయితే రాంచంద్రతో తనకు వేరే విషయాలలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్పారు. నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు దాదాపు 20 ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది.
నవదీప్ కూడా మత్తు పదార్థాలు తీసుకున్నారా లేదా అని తేల్చడం కోసం నవదీప్ ఒప్పుకుంటే నార్కోటిక్ పోలీసులు శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంది. రిపోర్ట్స్ అనంతరం మాదకద్రవ్యాలు ఏవైనా వాడినట్టు తేలితే రిహబిలిటేషన్ సెంటర్కు పంపించనున్నారు.
మరోవైపు నవదీప్ ద్వారానే తెలుగు సినీ ఇండస్ట్రీలోని పలువురికి మాదకద్రవ్యాలు సరఫరా అయినట్టు అనుమానాలు ఉన్నాయి.. నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు ప్రశ్నిస్తున్న తరుణంలో.. సినీ సిండస్ట్రీలోని పెద్దల్లో టెన్షన్ మొదలైనట్టు ప్రచారం సాగుతోంది. మరి నవదీప్ విచారణలో ఎవరి పేర్లు బయటపడతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.