యూరప్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ లోని వాస్తవాలను జీ-20 అతిథులకు కనిపించకుండా మోడీ సర్కార్ దాస్తోందని ఆయన అన్నారు. దేశంలో వాస్తవపరిస్థితులను దాచాల్సిన అవసరం లేదని ఆయన మండిపడ్డారు.
జీ-20 సమావేశాల నేపథ్యంలో పలు అంశాలపై కేంద్రాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. ఢిల్లీలోని వసంత్ విహార్ లోని ఓ మురికి వాడలో వున్న కూలీల క్యాంపునకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ షేర్ చేసింది. జీ-20 నేపథ్యంలో మురికి వాడల్లోని వలస కూలీలను ఎవరికి కనిపించకుండా కేంద్రం ఏర్పాట్లు చేసిందని ఆరోపించింది.
అంతకు ముందు కాంగ్రెస్ మరో వీడియో షేర్ చేసింది. అందులో ఢిల్లీలో పలు ప్రాంతాల్లో కుక్కలను బంధించి బోన్లలో పెడుతున్నారని తెలిపింది. వాటికి సరిగ్గా అన్నం పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
భారత్ ప్రభుత్వం మన పేదల ప్రజలను, జంతువులను దాచి పెడుతోందన్నారు. మన దేశ పరిస్థితులను జీ-20 అతిథులకు కనిపించకుండా దాచాల్సిన అవసరం లేదన్నారు. భారత్ లో ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని నిన్న రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యవస్థలను అణచి వేసేందుకు జరుగుతన్న ప్రయత్నాలపై యూరోపియన్ యూనియన్ లోనూ ఆందోళనలు నెలకొన్నాయన్నారు.