తెలంగాణా (Telanagana) రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహారం (Food Poison) తిని విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో విద్యార్థులతో (Students) పాటు తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతున్నారు.
దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టులో ప్రజాహితవ్యాజ్యం (పిల్) దాఖలైంది. బాలల హక్కుల జాతీయ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని గురుకులాల్లో కనీస సౌకర్యాలు లేవని, హాస్టళ్లలో తరచూ ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని అఖిల్‌శ్రీ గురుతేజ.. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో తరచూ ఫుడ్‌పాయిజన్ అవుతోందని.. దేవరుప్పుల, మన్ననూర్, మోర్తాడ్, నాగర్‌కర్నూల్‌లలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటాన్నయని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 40 మందికి పైగా విషాహారం తిని అస్వస్థతకు గురయిన విషయం మరవక ముందే, తాజాగా రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినీలు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. వీరిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే భోజనంలో బొద్దింకలు కనిపించాయని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇలా వరుసగా గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ కు హాస్టల్స్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.