నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూసే ఉద్యోగ నియామక పరీక్షలను కూడా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిర్వహించలేకపోతుందని తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఏ పరీక్ష పెట్టినా కూడా అది లీక్ అంటూ మళ్లీ పరీక్ష రద్దు చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుతుందని అన్నారు. ఇప్పటీ వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 17 సార్లు ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ (Exam Paper Leaks) అయ్యాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.
పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు టీచర్ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికే 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని, మరో 6 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
హైదరాబాద్ బషీర్ బాగ్ లోని భారతీయ విద్యాభవన్ లో జరిగిన రోజ్గర్ మేళా కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న పలు సంస్థల్లో సెలక్ట్ అయిన యువతీ, యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల రికమండేషన్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు యువతకు వస్తున్నాయని అన్నారు. రోజ్గర్ మేళా ద్వారా ఉద్యోగ నియమాకాల్లో ఎలాంటి అవినీతి, మోసం జరిగేందుకు చాన్స్ లేదన్నారు. గతంలో ఇంటర్వ్యూ లేకుండా… పై అధికారి మోక్షం వల్ల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఇవాళ ఉత్తీర్ణులను గుర్తించి ఇంటర్వ్యూ చేసి ఇస్తున్నారని చెప్పారు.