తెలంగాణాలో తీన్మార్ మల్లన్న(Theenmar Mallanna) రాజకీయ పార్టీ (Political party) పెడుతున్నట్లు ఈ ఏడాది ఏఫ్రిల్ లోనే ప్రకటించారు. ఆ తర్వాత పెద్దగా ఆ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ ఏమి రాలేదు. అసలు ఎన్నికల బరిలో మల్లన్న ఉంటాడా? లేదా అనే అనుమానాలు కూడా మొదలైయ్యాయి. అయితే ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. కాకపోతే అది తీన్మార్ మల్లన్న నుంచి కాదు, ఎలక్షన్ కమిషన్ (Election commission) నుంచి. అదేంటంటే…
తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో తెలంగాణాలో తాను పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు మల్లన్న గతంలో ప్రకటించారు. దీనిని రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరు రిజిస్టర్ చేసే ప్రక్రియను ఈసీ ప్రారంభించింది.
అందులో భాగంగా పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా ఈసీ కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘం తన వెబ్ సైట్లో మల్లన్న పార్టీకి సంబంధించి ఒక ప్రకటన జారీ చేసింది. మల్లన్న పార్టీ పేరుతో రిజిస్టర్ చేసుకున్న తెలంగాణా నిర్మాణ పార్టీపై ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్న ఈ నెల 20వ తేదీలోపు అభ్యంతరాలను స్వీకరిస్తామని, ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది.
మల్లన్న తెలంగాణ నిర్మాణ పార్టీని ప్రకటించిన సందర్భంలో తాను మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి మల్లారెడ్డిపై పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కొంతకాలం తర్వాత బీజేపీలో చేరిన మల్లన్న.. కొద్దిరోజుల పాటు ఆ పార్టీలో కొనసాగారు.
కొన్ని రోజుల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటవుతున్నాయనే భావనతో కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి కాస్త దగ్గరవుతున్నట్లు కనిపించగా… ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పార్టీతోనే ప్రజల్లోకి వెళ్లాలని మల్లన్న భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈసీ ప్రకటన రావడంతో మల్లన్న కొత్త పార్టీ ద్వారా వెళ్లాలని అనుకుంటే…దానిని దాదాపు మార్గం సుగమమైనట్లే.
ఇంకా పార్టీ నిర్మాణం సరిగా లేని తీన్మార్ మల్లన్న తాను సొంత పార్టీ ద్వారానే పోటీలో ఉండాలని అనుకుంటే …రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతారా? లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. మల్లన్న పార్టీ ఎలా ఉన్నా…ఇప్పటికైతే రాష్ట్రవ్యాప్తంగా మల్లన్నకు ఫాలోయింగ్ ఉంది.