వాన రాకడ..ప్రాణం పోకడ ఎవరికి తెలియదు అన్నట్లు..చెప్పుకోవడానికి వర్షాకాలమే అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు సరైన సమయంలో కురవడం లేదు. అయితే అతి వృష్టి..లేకపోతే అనావృష్టి అన్నట్లు వానలు వచ్చాయి అంటే కొన్ని రోజుల వరకు వదిలిపెట్టకుండా కురుస్తున్నాయి.
లేకపోతే అసలు వాన కాదు కదా..కనీసం చినుకులు కూడా పడటం లేదు. గడిచిన 20 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి వర్షాలు మాత్రమే కురిశాయి తప్ప. భారీ వర్షాలు కురవలేదు. దీంతో రెండు రాష్ట్రాల ప్రజలు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ (ఐఎండీ) (imd)ఓ కీలక ప్రకటన చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో (two telugu states) రానున్న ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు (rains) కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో, గ్రీన్ అలర్ట్‌ను జారీ చేశారు.
ఏపీ (ap)లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.