ముంబయి సెన్సార్ బోర్డు (Censor Board) కార్యాలయంలో అవినీతి (Corruption) పేరుకుపోయిందంటూ నటుడు విశాల్ (Actor Vishal) చేసిన ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ స్పందించింది. ఈ విషయం చాలా దురదృష్టకరమని పేర్కొంది. కేంద్రం ఏమందంటే…
“సీబీఎఫ్సీలో జరిగిన అవినీతిపై నటుడు విశాల్ బయటపెట్టిన అంశం చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాం. ఈ విషయంపై విచారణ జరిపేందుకు ఒక సీనియర్ అధికారిని ముంబయికి పంపాం. సెన్సార్ బోర్డు వేధింపులకు సంబంధించిన ఏదైనా విషయాలను గురించి సమాచారాన్ని తెలిపేందుకు jsfilms.inb@nic.inను ఉపయోగించుకోవల్సిందిగా కోరుతున్నాము”. అని సమాచార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా తెలిపింది.
విశాల్ ఏమన్నారంటే…
ముంబైలోని సెన్సార్ బోర్డు సభ్యులు రూ.6 లక్షల 50 వేలు లంచం తీసుకున్నారని విశాల్ ఆరోపణలు చేశారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవినీతి విషయంలో ముంబాయి సెన్సార్ బోర్డు కార్యాలయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని అన్నారు. తాను తీసిన ‘మార్క్ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్ కోసం రూ. 6.5 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ.3.5 లక్షలు ఇచ్చామని తెలిపారు. తనకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని విశాల్ అన్నారు.
ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను ప్రధాని మోదీ కోరారు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఇలా లంచాలు ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన వద్ద ఉన్న ఆధారాలను వెల్లడిస్తానని, సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని విశాల్ అన్నారు.