హైదరాబాద్ (Hyderabad) లో సందడిగా వినాయక నిమజ్జనాలు (Ganesh Nimajjanam) మొదలైయ్యాయి. ఒక వైపు గణనాధుల ఊరేగింపులు జరుగుతుండగా, మరో వైపు జోరుగా వానలు (Rains) కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం కురిసిన వర్షాలతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. దాదాపు మూడు గంటల పాటు ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరంలోని చాలా చోట్ల రోడ్లన్ని నీట మునిగాయి. కొన్ని చోట్ల మోకాలి లోతున నీరు చేరింది. కుండపోతగా పడుతున్న వర్షానికి రహదారులన్నీ జలమమయ్యాయి. ఏకధాటిగా కురుస్తుండడంతో వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అకస్మాత్తుగా కురిసిన వాన నీరంతా రోడ్లపై నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మరోవైపు మరో మూడు రోజుల పాటు తెలంగాణకు వర్షాలు తప్పవని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఇవాళ సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
ఇక ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ద్రోణుల కారణంగా వానలు కురుస్తున్నాయంటున్నారు. ఇవాళ ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల , తూర్పుగోదావరి , గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.