క్షణికావేశం ఆ భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టించింది. భార్య విడాకులు కోరుతూ లోక్ అదాలత్(Lok Adalat)ను ఆశ్రయించింది. అయితే భర్తలో వచ్చిన మార్పు.. తీర్పుని మార్చేసింది.
హృదయాలను కదిలించే సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwala district)కేంద్రంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…గద్వాల పట్టణం సుంకులమ్మ మెట్టుకు చెందిన డ్రైవర్ గోవింద్‌కు రాజేశ్వరి అనే మహిళతో వివాహమైంది.
అయితే గోవిందు తాగిన మైకంలో తరుచూ తన భార్యతో గొడవపడి చేయి చేసుకునేవాడు. విసిగిపోయిన రాజేశ్వరి చివరకు గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తరువాత రాజీ కొరకు జాతీయ లోక్ అదాలత్‌కు చేరింది.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ‘కె.కుషా(K. Kusha)’తో పాటు జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ‘అన్నీరోజ్ క్రిస్టియన్(Annierose Christian)’, సీనియర్ సివిల్ జడ్జి ‘గంటా కవిత’, జూనియర్ సివిల్ జడ్జి ‘ఉదయ్ నాయక్(Uday Nayak)’ సమక్షంలో జరిగిన లోక్ అదాలత్ ఈ దంపతులను కలిపి దండలను మార్పించింది.
ఈ సందర్భంగా గోవింద్ భావోద్వేగానికి గురయ్యాడు. తాగిన మైకంలో తన భార్యను కొడుతుండడం పొరపాటేనని నిజాయితీగా ఒప్పుకున్నాడు. దీంతో న్యాయమూర్తులు ఆమెకు సారీ చెప్పాలని కోరగా సారే కాదు…కాళ్లే మొక్కుతానని తన భార్య కాళ్ళకు మొక్కాడు.
వాస్తవం చెప్పాలంటే..తన భార్య తనను తల్లిదండ్రులకన్నా బాగా చూసుకుంటుందని ఇక ముందు అలా చేయనని గోవింద్ చెప్పాడు. ఈ సంఘటనతో లోక్ అదాలత్ ఒక్క సారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.