ఆడుదాం ఆంధ్రా (Adudam Andhra) కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలుత అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భాగంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు జరగనున్నాయి. మండల స్థాయిలో జనవరి పదో తేదీ నుంచి 23 వరకు.. నియోజకవర్గ స్థాయిలో జనవరి 24వ తేదీ నుంచి 30 వరకూ జరగనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి పదో తేదీ వరకూ రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయి. ఈ నేపథ్యంలో గుంటూరు (Guntur) జిల్లాలో ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రాంను ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy).
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడల మంత్రి ఆర్కే రోజా ( RK Roja) తో కలిసి పాల్గొన్న జగన్.. ఈ సందర్భంగా ఆమెతో క్రికెట్ బ్యాట్ పట్టించారు. బ్యాటింగ్ ఎలా చేయాలో స్వయంగా ఆడి చూపించారు. దీంతో ఆమె కూడా ఆయన చెప్పిన విధంగా బ్యాటింగ్ చేస్తూ హల్ చల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ముందుగా బ్యాటింగ్ చేయమంటూ బ్యాట్ చేతికి రోజాను ఆహ్వానించారు జగన్. పిచ్ పై బ్యాట్ ఎక్కడ పెట్టాలో తెలియకపోవడంతో స్వయంగా సీఎం క్రీజులో ఎలా నిలబడాలో, బ్యాటింగ్ ఎలా చేయాలో చేసి చూపించారు.
జగన్ పాఠాలతో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాక తొలి బంతినే రోజా క్లీన్ షాట్ కొట్టేశారు. దాంతో సీఎం జగన్ తో పాటు మంత్రులు, అధికారులు చప్పట్లతో ఆమెను అభినందించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగారు సీఎం. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా, రోజా కీపింగ్ చేశారు. రోజా స్టయిల్ లో ఒక బంతిని మాత్రమే జగన్ భారీ షాట్ కు ప్రయత్నించారు. అనంతరం మాట్లాడిన జగన్.. అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని, ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అని పేర్కొన్నారు. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరమని, క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సీఎం చెప్పారు. కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు సీఎం కిట్లను పంపిణీ చేశారు.