ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దూకుడు పెంచారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను స్పీడప్ చేశారు. గులాబీ నేతలను నియోజకవర్గాలకే పరిమితం చేసి మరోసారి గెలుపు జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. కానీ, ఎక్కడ చూసినా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది విపక్షాల(Opposition) వాదన. రాష్ట్రమంతా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉందని.. మరోసారి బీఆర్ఎస్(BRS) గెలిచే ఛాన్స్ లేదని అంటున్నాయి. దీనికి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలే నిదర్శనమని వివరిస్తున్నాయి.
తొమ్మిదిన్నరేళ్లుగా చేయని పనులు కేసీఆర్ కు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాయని అడుగుతున్నారు విపక్ష నేతలు. ఇన్నాళ్లూ రుణమాఫీ ఊసెత్తని ఆయన.. ఇప్పుడు త్వరలోనే చేస్తామని చెప్పడం ఎన్నికల డ్రామా కాక ఇంకేంటని అంటున్నారు. కాంగ్రెస్(Congress) నేతలైతే.. ఇంకో రెండు, మూడు నెలల్లో తమ ప్రభుత్వం వస్తుందని.. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు. తాము కేసీఆర్ లా కాదని వెంటనే రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు.
కేసీఆర్ ముమ్మాటికీ అసెంబ్లీలో అభద్రతాభావంతో మాట్లాడారని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. సర్వేల్లో ప్రభుత్వం చేజారుతుందని తేలడంతో.. ఆర్టీసీ మంత్రం జపిస్తున్నారని.. అందుకే, చకచకా విలీనం చేశారని వివరిస్తున్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులను బుట్టలో వేసుకునేందుకు ఏదో ఒకటి చెబుతున్నారని.. ఆయన్ను నమ్మవద్దని సూచిస్తున్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కాలయాపన చేసిన కేసీఆర్ కు ఇప్పుడు హామీలు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావని.. చెప్పులు కాదు, కాళ్లు అరిగేలా తిరిగినా ఇవ్వలేదని విమర్శిస్తున్నారు విపక్ష నేతలు. అలాంటిది, ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో ఎన్నో ఏళ్ల క్రితం పూర్తయిన ఇళ్లను ఇప్పుడు ఇచ్చేందుకు చూస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పే మాటలన్నీ ఎన్నికల కోసమేనని అంటున్నారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. మొత్తానికి కేసీఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని సూచిస్తున్నారు.