తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వెలుగుచూసిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping case) కేసు పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కొనసాగుతున్న ఎస్ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు (Suspended Sib dsp Praneeth rao) ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీలో (Custody) ఉన్న విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును ప్రణీత్ రావు సవాల్ చేయగా గురువారం హైకోర్టు కొట్టేసింది. కస్టడీపై కింది కోర్టు తీర్పును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆరాధే సమర్థించారు. కస్టడీ విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని, కస్టడీ ముగించిన వెంటనే తనను జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ప్రణీత్ రావు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా, ప్రణీత్ రావు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ప్రణీత్ రావుకు బీఆర్ఎస్కు చెందిన ఓ మంత్రి అండగా నిలిచారని సమాచారం. ఆయన అండదండతోనే ప్రణీత్ రావు నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నాటి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
దీనికితోడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత ప్రభుత్వంలో ట్యాపింగ్ ఫోన్ రికార్డింగ్స్ కు సంబంధించిన డేటాను ధ్వంసం చేయడంతో పాటు ఇతర హార్ట్ డిస్కుల్లోకి డేటాను కాపీ చేసుకున్నాడని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అప్పట్లో ప్రణీత్‌కు సహకరించిన అధికారులు, ఆదేశాలిచ్చిన నేతల గురించి ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కూపీ లాగుతున్నారు.