ఆంధ్రా ఏజెన్సీ నుంచి విపరీతంగా తెలంగాణ (Telangana), మహారాష్ట్ర (Maharashtra) కు గంజాయి సరఫరా అవుతోందని పోలీసులు తరచూ చెబుతున్నారు. స్మగ్లింగ్ చేస్తున్న గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకుంటూ ఉంటారు. అయితే.. అక్కడెక్కడి నుంచో గంజాయి తీసుకురావడం.. పోలీసులు (Police) పట్టుకోవడం.. ఈ చిక్కులన్నీ ఎందుకని అనున్నాడో ఏమోగానీ.. ఓ వ్యక్తి ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్నాడు.
సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కు చెందిన హైదర్.. తన ఇంటి వద్దే గంజాయి సాగు చేస్తున్నాడు. దాదాపు 31 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా చేసి.. గంజాయి మొక్కలను అక్కడి నుండి తరలించారు.
గంజాయి మత్తుకు బానిసై యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు పోలీసులు. మత్తు పదార్థాల రవాణా, వాడకం వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వద్దనే గంజాయి సాగు చేస్తున్న హైదర్ ను పోలీసులు వల పన్ని పట్టుకున్నారు.