స్కిల్ డెవెలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu). ఈ అరెస్ట్ పై రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల దాకా పలువురు స్పందిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajnikanth) రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తుంటారని.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని అన్నారు.
చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ (Nara Lokesh) కి ఫోన్ చేసి మాట్లాడారు రజనీకాంత్. ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబు అభివృద్ధే ఆయనకు రక్ష అని తెలిపారు రజనీకాంత్.
ఇక, చంద్రబాబు అరెస్ట్ పై కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి (Renuka Chowdary) స్పందించారు. ఈ అరెస్ట్ ను ఖండించిన ఆమె.. రాజమండ్రి సెంట్రల్ జైలు ఆయనకు సేఫ్ కాదని అన్నారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని, భద్రత కల్పించాలని కోరారు. జగన్ ఒక మెంటల్ అని, ఏమైనా చేస్తాడని వ్యాఖ్యానించారు. బంగారం లాంటి ఏపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని కోరారు రేణుకా చౌదరి.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.