ఢిల్లీ (Delhi) లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-Delhi) లో విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. ఎంతో సందడిగా ఫెస్ట్ లో ఎంజాయ్ చేసిన వారు బాత్రూంలో కెమెరా (Camera) చూసి షాకయ్యారు. దీనిపై మొదట ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సోషల్ మీడియా (Social Media) లో వాపోయారు.
ఐఐటీ ఢిల్లీలో ఎంతో అట్టహాసంగా ఫెస్ట్ నిర్వహించారు. దీనికి పలు కాలేజీల విద్యార్థులను హాజరయ్యారు. అయితే.. భారతి కాలేజీకి చెందిన 10 మంది విద్యార్థినులు ఫ్యాషన్ షో కోసం దుస్తులు మార్చుకునేందుకు వాష్ రూమ్ కు వెళ్లారు. అక్కడ రహస్యంగా కెమెరాతో రికార్డ్ అవుతున్న విషయాన్ని గమనించారు.
బాధిత విద్యార్థినులు సోషల్ మీడియాలో తమ తమ గోడు వెల్లబోసుకున్నారు. యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. ఈ ఘటనపై కిషన్ గఢ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది.
రంగంలోకి దిగిన పోలీసులు.. 20 ఏళ్ల స్వీపర్ ఇదంతా చేశాడని తేల్చారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 354సీ కింద కేసు నమోదు పెట్టి.. రిమాండ్ కు తరలించారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు పోలీసులు. ఇటు ఐఐటీ ఢిల్లీ కూడా స్పందించింది. ఇలాంటివి సహించేది లేదని స్పష్టం చేసింది. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని తెలిపింది.