షహీద్ కన్నెగంటి హనుమంతు..స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో తెలుగు నేల దేశం కోసం అతను ఊపిరిలూదాడు.చివరి శ్వాసవరకు ‘వందేమాతరం’ (Vandemataram) అనే నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా నినదించాడు. అతని చుట్టూ ఉన్నవారికి అసలైన స్వాతంత్ర్యం(Independance) అంటే ఏమిటి? స్వేచ్ఛా వాయువులు ఎలా తీసుకోవాలో నేర్పించిన మహనీయుడు. షహీద్ హనుమంతు బ్రిటీష్ వారి ‘పుల్లరి’(Pullari) పన్నును తీవ్రంగా వ్యతిరేకించాడు. దాని నిర్మూలన కోసం ఎన్నో ఉద్యమాలు చేశాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దుర్గి మండలం మించలపాడు గ్రామంలో కోలగట్ల అచ్చమ్మ, వెంకటప్పయ్య దంపతులకు షహీద్ కన్నెగంటి హనుమంతు(Kanneganti hanumantu) జన్మించాడు. అతని బాల్యంలో బ్రిటీష్ వారి పరిపాలనలో తోటి భారతీయులు అనుభవించిన అవమానాలు, బాధలను చూస్తూ పెరిగాడు. అప్పుడే హనుమంతులో వేదన, బ్రిటీష్ వారంటే కోపం పెంచుకున్నాడు.
హనుమంతు పెరిగి పెద్దయ్యాక..బ్రిటీష్ వారు ‘పుల్లరి’ సిస్తు కట్టాలని ప్రజలను తీవ్రంగా వేధించేవాడు. ఆ టైంలో హనుమంతు వారికి ఎదురుతిరగడం ప్రారంభించాడు. సాధారణంగా ఈ పుల్లరి పన్నును..అటవీ గ్రామాల రైతులు అటవీ ఉత్పత్తులను ఉపయోగించినా విధించేవారు. అడవుల్లో కలపను సేకరించినా.. పశువులను మేపడానికి గడ్డి తెచ్చినా పన్ను విధించేవారు.
దీంతో హనుమంతు ప్రజలను పన్ను చెల్లించవద్దని వారిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా పల్నాడు ప్రాంతంలో ‘పుల్లరి సత్యాగ్రహం’ నిర్వహించారు. ఈ ఉద్యమం మెయిన్ ఎజెండా ఏమిటంటే బ్రిటీష్ వారు పన్నులను(TAX) ఎత్తివేసే వరకు గ్రామస్తులు ఎవరూ వారికి పనుల్లో సాయం చేయరు. ఆ సమయంలో కొండా వెంకటప్పయ్య వంటి స్థానిక నాయకులు కూడా హనుమంతుకు మద్దతు తెలిపారు. షాహీద్ హనుమంతు ఆధ్వర్యంలో ప్రజలు రెవెన్యూ, అటవీశాఖ అధికారులపై సామాజిక బహిష్కరణ విధించారు.
ఆహారం,లాండ్రీ,క్షురకుల సేవలతో సహా అధికారులకు అన్ని వస్తువులు,సేవలను నిరాకరించారు. ప్రజలను చైతన్య పరిచి వారిని ఉద్యమం వైపు నడిపిస్తున్నాడని హనుమంతు మీద బ్రిటీష్ వారు కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే షహీద్ హనుమంతును 1921-22లో పల్నాడు అటవీ సత్యాగ్రహంలో భాగంగా నల్లమల్ల కొండల చెంచులతో కలిపి అనేక సార్లు అరెస్టు చేశారు.
అనంతరం ఓ బ్రిటీష్ కలోనియల్ అడ్మినిస్ట్రేటర్ టీజీ రూథర్‌ఫోర్డ్ షహీద్ హనుమంతుకు లంచం ఆశ చూపించాడు. దుర్గి ప్రాంతంలోని 45 గ్రామాలకు హనుమంతుని జమీందార్‌గా చేస్తానని, ఉద్యమాలు మానుకోవాలని సూచించారు. కానీ, అతను నిరాకరించడంతో పాటు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. మీకు ఎందుకు కట్టాలిరా శిస్తు? నీరు పెట్టావా, నాటు వేసావా? కోత కోసావా, కుప్ప నుర్చవా? ఎందుకు కట్టాలి రా శిస్తు? అని గట్టిగా ప్రశ్నించాడు.
ఆ తర్వాత 1922 ఫిబ్రవరి 22న బ్రిటీష్ సైనికులు మించలపాడుకు వచ్చి పుల్లరి పన్ను చెల్లించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని షహీద్ హనుమంతును హెచ్చరించారు. మహత్మా గాంధీ అప్పటికే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించుకున్నాడు.
దీంతో హనుమంతు పన్ను చెల్లించడానికి ఓకే అన్నాడు. ఆ తర్వాత ఇతర మార్గాల్లో తన పోరాటాన్ని కొనసాగించాడు. కోటప్పకొండలో మహాశివరాత్రి రోజున హనుమంతు అతని అనుచరులు ఊరేగింపులో పాల్గొనడానికి బయలుదేరారు. మహిళలు, పిల్లలు మాత్రమే గ్రామంలో ఉన్నారు. హనుమంతు లేని సమయం చూసి జిల్లా కలెక్టర్ వార్నర్ గ్రామాన్ని చుట్టుముట్టి పశువులను తీసుకెళ్లడానికి కొందరు పోలీసు దళాలను పంపించాడు.
పెద్దలు, మహిళలు పోలీసు దళాలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని తుపాకీ రైఫిల్స్‌తో బలవంతంగా కొట్టి ఈడ్చీ పడేశారు. విషయం తెలుసుకున్న హనుమంతు వెంటనే గ్రామానికి పరుగెత్తాడు. పెద్దలను, మహిళలను కొట్టవద్దని బ్రిటిష్ వారిని వేడుకున్నాడు. కానీ బ్రిటీష్ వారు కనికరం లేకుండా అతనిపై కాల్పులు జరిపారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 సార్లు కాల్పులు జరిపారు.
అయితే, హనుమంతు చనిపోయే వరకు సుమారు 4 గంటల పాటు ‘వందేమాతరం’ నినాదాలు చేశాడు. గ్రామస్తులు అతనికి నీళ్లివ్వకుండా బ్రిటీషర్స్ అడ్డుకున్నారు. హనుమంతు చనిపోయాక 4 రోజుల తర్వాత అతని అంత్యక్రియలను ఆయన భార్య,బంధువులు మించలపాడులో నిర్వహించారు.