బ్రిటీష్ వారి అజమాయిషీని ఎదురించడంతో పాటు వారికి నిద్రలు లేని రాత్రులు మిగిల్చిన వారిలో లాలా జైదయాల్ ఒకరు. ఏకంగా బ్రిటీష్ ఏంపైర్ మీదకు యుద్ధాన్ని ప్రకటించాడు. వారి ఆధీనంలోని ఒక సంస్థానాన్ని చేజిక్కించుకుని ఏకంగా కింగ్ మేయర్ అయ్యాడు.కొంతకాలం సొంతంగా రాజ్యాన్ని పాలించిన అతను బ్రిటీష్ సైన్యం జరిపిన దాడుల్లో వీరమరణం పొందాడు.లాలాకు కుడి భుజంగా ఉన్న మెహ్రాబ్ ఖాన్ కూడా చివరకు ఉరికొయ్యకు వేలాడాడు. అయినప్పటికీ వీరి యుద్ధ పరాక్రమం గురించి ఆనాటి నెత్తుటి మరకలతో లిఖించబడిన చరిత్ర నేటి తరానికి ప్రస్పుటం చేస్తోంది.
లాలా జైదయాల్ భరత్ పూర్లోని ‘కామా’లో జన్మించాడు. తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాక ‘హడావోటీ’ ఏజెన్సీలో ‘కోట మహారావు’ న్యాయవాదిగా అపాయింట్ అయ్యాడు. అయితే, వారికి తెలియదు లాలా కోట తిరుగుబాటుకు కారణం అవుతాడని.. ఇకపోతే కరోలిలో జన్మించిన మెహ్రాబ్ ఖాన్ కోట సైన్యంలో ‘రిసల్దార్’గా ఉండేవాడు. ఇతను లాలాకు సహచరుడు. వీరిద్దరు కలిసి కోటలో ఒక కథనాన్ని ప్రచారం చేసి అక్కడున్న జనాల్లో ఉద్యమ ఊపిర్లు ఊదారు.
హిందువులు, ముస్లిముల్లో ఒక మతపరమైన విప్లవాన్ని రగిలించారు.దానిని బ్రిటీష్ వారి పతనం కోసం వాడారు. హిందువులు దైవంగా భావించే జంతువు మాంసంతో బ్రిటీషర్స్ కొత్త ఆయుధాలు తయారు చేస్తున్నారని వారిని నమ్మించారు.అలాగే ముస్లిములు తినే తినుబండారాలలో మానవుల ఎముకల పొడిని కలుపుతున్నారని వారిని నమ్మించి విప్లవం వైపు వారిని మళ్లించారు. ఫలితంగా ఓ రోజు ఒక పెను ఉపద్రవమే ముంచుకొచ్చింది.
అదే టైంలో ‘మేజర్ బర్టన్’ తన ఇద్దరు కుమారులు 21 ఏళ్ల ‘ఫ్రాంక్’, 16ఏళ్ల ‘ఆర్థర్’తో కలిసి కోటాను సందర్శించారు. ప్రస్తుత దేశరాజధాని ‘ఢిల్లీ’ని బ్రిటీష్ ఎంపైర్‌లో విలీనానికి గౌరవసూచకంగా కోటాలో పరేడ్ ఏర్పాటుచేశారు. అదే టైంలో సంస్థానం రాజు, మేజర్ బర్టన్లపై తిరుగుబాటు చేయాలని లాలా బృందం నిర్ణయించింది. సరిగ్గా 15 అక్టోబర్ 1857న ఆగ్రహంతో ఉన్న హిందూ, ముస్లిం గ్రూపులు కత్తులు,తుపాకులను సేకరించి రెసిడెన్సీ బంగ్లాను చుట్టుముట్టాయి.
స్థానిక పౌరులు కూడా వారితో కలిసి కాల్పులు జరిపి వెంటనే ప్యాలెస్ స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటును మేజర్ బర్టన్ ముందుగా గుర్తించలేకపోయాడు. గన్ ఫైరింగ్ విని తన స్వాగతం కోసం జరుగుతున్న ఏర్పాట్లు అనుకున్నాడు. అతనికి వాస్తవికత తెలియదు. తెలిసేలోపు జరగాల్సినది అంతా జరిగిపోయింది. ‘మేజర్ బర్టన్’, అతని ఇద్దరు కొడుకులను తిరుగుబాటుదారులు చంపేశారు. అయితే, బర్టన్ తలను లాలా బృందం నరికి చేతబట్టుకుని కవాతు నిర్వహించింది.
ఈ తిరుగుబాటు గురించి తెలుసుకున్న బ్రిటీష్ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు గల కారకులకు మృత్యు దండన విధించారు. ఆలోపు షహీద్ లాలా జైదయాల్ కోటా సంస్థానం పరిపాలనకు బాధ్యత వహించారు. పూర్వం కోటా రాజును తన సొంత రాజభవనంలోనే బంధించారు. 6 నెలల పాటు, కోట పరిపాలనను షహీద్ జైదయాల్ చూసుకున్నారు. అతని సహచరుడు మెహ్రబ్ ఖాన్ నగర రక్షణకు బాధ్యత వహించాడు.
రాజ్యాన్ని కాపాడుకోవడానికి లాలా, మెహ్రబ్ ఖాన్ ‘సుంబల్ఘర్ పాలకుడు విఠల్’ను సాయం కోరారు. లాలా పాలనలో కోటాలోని ప్రజలు, అధికారులు సంతోషంగా ఉండసాగారు.అయితే, వీరి పాలన ఎక్కువ కాలం కొనసాగలేదు. 1858 మార్చి 30న కరౌలీ మహారాజుతో చేతులు కలిపి బ్రిటిష్ సేనలు కోటాను తిరిగి ఆక్రమించుకున్నాయి. ఆ సమయంలో షహీద్ జైదయాల్ కోటను విడిచి బికనేర్కు వెళ్లాడు. దీంతో అతని తలపై 12000 రివార్డు బహుమతిని బ్రిటీష్ అధికారులు ప్రకటించారు.
ఈ క్రమంలోనే షహీద్ లాలా జైదయాల్,మెహ్రబ్ ఖాన్, తన అనుచరులు అనేక కష్టాలను అనుభవించారు. ఆ తర్వాత కొన్నిరోజులకు షహీద్ లాలా జైదయాల్ భట్నాగర్ను బ్రిటీష్ సైన్యం అరెస్టు చేసింది. తిరుగుబాటు, బ్రిటీష్ అధికారిని హత్య చేసిన కేసులో హదౌతి రాజకీయ ఏజెంట్ W.H కోర్టు విచారణ జరిపి లాలాకు మరణశిక్ష విధించింది. 1860 సెప్టెంబరు 17న లాలా జైదయాల్కు కోటాలో ఉరిశిక్షను అమలుచేశారు.