భారతదేశానికి స్వాతంత్య్రం(Freedom Fight) అంత సులువుగా ఏమీ రాలేదు. ఎన్నో లక్షల మందిని బ్రిటీష్ సైనికులు పొట్టనబెట్టుకున్నారు. అయితే, స్వాతంత్రోద్యమ కాలంలో కొందరు శాంతియుతంగా నిరసనలు చేపడితే, మరికొందరు యుద్దాన్ని ఎంచుకున్నారు. బ్రిటీష్ వారి ఆదేశాలను ధిక్కరించి వారికి ఎదురొడ్డి నిలిచారు. బుల్లెట్ల గాయాలతో నెత్తురోడుతున్నా ‘వందేమాతరం’ నినాదాలు చేస్తూ తమ ప్రాణాలను వదిలేశారు. అలా భారత జెండాను మోస్తూ బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయిన ఫ్రీడమ్ ఫైటర్స్ లో షహీద్ తిరువూర్ కుమారన్(Tiruvuru kumaaran) ఒకరు.
షహీద్ కుమారస్వామి ముదలియార్ (కుమరన్) 04 అక్టోబరు 1904న తమిళనాడులోని చెన్నిమలైలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఈరోడ్‌లోని చేనేత కార్మికుల ఫ్యామిలీకి చెందిన కుమరన్ డబ్బులు లేక విద్యను అభ్యసించలేకపోయాడు. కుటుంబం కోసం చిన్నతనంలోనే వ్యాపారం రంగంలో మెలకువలను నేర్చుకున్నాడు.అతని చదువు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే సాగింది. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు 19 ఏళ్లకు వివాహం చేసుకున్నాడు. అనంతరం కుటుంబం కోసం స్పిన్నింగ్ మిల్లులో అసిస్టెంట్‌గా పని చేస్తూనే ఉన్నాడు.
యువకుడైన షహీద్ కుమారన్ దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్న స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలిసి చాలా ప్రభావితమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రదర్శనలు, కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసి కుటుంబసభ్యులు అతన్ని మందలించారు. ఉద్యమానికి దూరంగా ఉండాలని హితవు పలికారు.అతని సహోద్యోగులను కలిసి ఉద్యమాల్లో పాల్గొనరాదని కుమరన్ పేరెంట్స్ చెప్పేవారు.
అయినప్పటికీ కుమారన్ వారి సలహాలను పట్టించుకోలేదు. త్వరితగతిన ‘దేశ బంధు యువజన సంఘాన్ని’ స్థాపించాడు. ఇందులోని సభ్యులు ప్రధానంగా తమిళనాడు,ఇతర పరిసర ప్రాంతాల నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి వచ్చిన యువకులు. వారు తమిళనాడు అంతటా అనేక బ్రిటిష్ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. షాహీద్ కుమారన్‌ను ‘తిరుపూర్ కుమారన్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతను ఫ్రీడమ్ ఫైట్‌లో పాల్గొనడానికి ముందు యువతకు ప్రేరణను ఇచ్చాడు.
ఈ క్రమంలోనే 1932 బొంబాయిలో ఓ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించినందుకు గాను మహత్మా గాంధీని బ్రిటీషర్స్ జైలులో పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగాయి. అదే ఏడాది జనవరి 11న తిరుపూర్‌లో బ్రిటీష్ అధికారులను ఎదురించి యాగి పీఎస్ సుందరం నేతృత్వంలో దేశభక్తి కవాతును పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆ సమయంలో నిషేధం విధించినా నిరసనకారులు మాత్రం జాతీయ జెండాను పట్టుకున్నారు.
జెండా పట్టుకుని నిరసన తెలిపిన వారిలో షహీద్ కుమారన్ ఒకరు.అయితే, ఉన్నట్టుండి నిరసనకారులపై బ్రిటీష్ బలగాలు లాఠీచార్జి చేశాయి. అప్పుడు కుమారన్ అక్కడి నుంచి వెళ్ళడానికి నిరాకరించాడు. ఈ నేపథ్యంలోనే జరిగిన అల్లకల్లోలంలో చిక్కుకోగా.. మరుసటి రోజు జాతీయ జెండాను చేతిలో పట్టుకుని చనిపోయి కనిపించాడు. కేవలం 27ఏళ్లకే దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు షహీద్ కుమారన్.
కాగా, ఈ యువ స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళులర్పించేందుకు తిరుపూర్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న కుమరన్ సలైలో తిరుపూర్ కుమరన్ స్మారకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. 2004లో ఈరోడ్ జిల్లా (తమిళనాడు)లోని చెన్నిమలైలో స్మారక స్టాంపును కూడా విడుదల చేశారు.ఆయన 118వ జయంతి సందర్భంగా 4 అక్టోబర్ 2021న తమిళనాడు సీఎం ఈరోడ్ నగరంలోని సంపత్ నగర్ మెయిన్ రోడ్డు పేరును కూడా తియాగి కుమరన్ రోడ్‌గా మార్చారు.