భారత స్వతంత్య్ర పోరాటంలో జలియన్ వాలా బాగ్ ను తలిపించే ఘటన మున్షిగంజ్ (రాయ్ బరేలీ)లో జరిగింది. 1921లో మున్షిగంజ్ లో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా రైతులంతా పోరుబాట పట్టారు. జిల్లా అధికారుల కార్యాలయాన్ని మట్టడించేందుకు కదం తొక్కారు. దీంతో బ్రిటీష్ సైన్యం వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వందల మంది రైతులు మరణించారు.
1920లో బాబా రామ్ చందర్ అనే వ్యక్తి ఫిజి నుంచి భారత్ కు వచ్చారు. అదే ఏడాది రాయ్ బరేలీలో ‘కిసాన్ సభ’ను ఏర్పాటు చేశారు. ఇందులో చాలామంది రైతులు సభ్యులుగా చేరి ప్రభుత్వ దురాగతాలకు ఎదురు తిరిగారు. ముఖ్యంగా ప్రభుత్వం విధించిన పన్నులు కట్టబోమని తేల్చి చెప్పారు. రోజురోజుకూ నిరసనలు పెరిగిపోవడంతో బ్రిటీష్ అధికారుల్లో ఆగ్రహం పెరిగిపోయింది. ఈ క్రమంలో పర్ స్టా గంజ్ ప్రాంతంలో రైతులపై బ్రిటీష్ సైన్యం కాల్పులు జరిపింది.
ఈ కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. నిరసలను పక్క దోవ పట్టించేందుకు రైతులపై బ్రిటీష్ అధికారులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసేందుకు ప్రయత్నించారని అందుకే కాల్పులు జరిపాపమని అసత్య ప్రచారాలు చేశారు. బ్రిటీష్ సైన్యం దురాగతలపై విసిగి పోయిన రైతులు 1921 జనవరి 6న జిల్లా హెడ్ క్వార్టర్స్ కు భారీ ర్యాలీగా వెళ్లారు.
దీనిపై ఆగ్రహంతో ఊగిపోయిన బ్రిటీష్ అధికారులు రైతులపై కాల్పులకు ఆదేశించారు. దీంతో రైతులపై బ్రిటీష్ సైనికులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వందలాది మంది రైతుల ప్రాణాలను కోల్పోయారు. రైతుల మృతదేహాలతో అక్కడి సాయి నది నిండిపోయింది.