షా మల్ సింగ్… బ్రిటీష్ పాలకుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు. బ్రిటీష్ రెవెన్యూ వ్యవస్థను వ్యతిరేకించిన ధైర్యశాలి. 84 గ్రామాల ప్రజలను ఏకం చేసి బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ధీరుడు. బ్రిటీష్ అధికారికి చెందిన బంగ్లాను స్వాధీనం చేసుకుని దాన్ని న్యాయ మందిరంగా మార్చిన మహనీయుడు.
1797లో యూపీలోని బరౌత్ పరగణాల్లో షా మల్ సింగ్ జన్మించారు. చౌరసీ దేస్ (84 గ్రామాలు) భూములు చాలా వరకు సారవంతంగా ఉండేవి. దీంతో ఆ ప్రాంతమంతా పచ్చని పంటలతో అందంగా కనిపించేది. రైతులంతా చాలా వరకు ధనవంతులుగా ఉండే వారు. ఈ ప్రాంతంలో బ్రిటీష్ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు.
ఈ పన్నుల వల్ల చాలా మంది తమ భూములను కోల్పోయారు. దీంతో బ్రిటీష్ పాలకులకు ఎదురు తిరగాలని షామల్ నిర్ణయించుకున్నారు. రాత్రుళ్లు రోజుకో గ్రామం వెళుతూ అక్కడి రైతులను చైతన్యపరిచారు. అనంతరం బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. వడ్డీ వ్యాపారులు, బ్రిటీష్ అధికారుల ఇళ్లపై ఉద్యమకారులు దాడులు చేసేవారు. అక్కడ భారీగా డబ్బును కొల్ల గొట్టేవారు.
ఉద్యమ తీవ్రతను గుర్తించిన బ్రిటీష్ వాళ్లు దాన్ని అణిచి వేయాలని నిర్ణయించారు. భారీ ఎత్తున ఆ ప్రాంతానికి బ్రిటీష్ సైన్యాన్ని పంపి ఉద్యమాన్ని అణిచి వేశారు. ఆ సమయంలోనే షహీద్ షా మల్ సింగ్ కన్నుమూశారు.