సోహన్ లాల్ పాతక్ (Sohan Lal Pathak)… వందేమాతం ఉర్దూ పత్రికకు సంపాదకుడిగా పని చేస్తూ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష రగిలించిన గొప్ప దేశ భక్తుడు. గదర్ పార్టీ తరఫున బర్మా, మలేషియా, సింగపూర్ లలో సైనికులతో కలిసి బ్రిటీష్ వ్యతిరేక తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. క్షమాపణ చెబితే ప్రాణ భిక్ష పెడతామని బ్రిటీష్ వాళ్లు చేసిన ఆఫర్ ను తిరస్కరించిన గొప్ప వీరుడు. క్షమాపణ చెప్పాల్సింది మీరేనని తాను కాదని తెగేసి చెప్పిన ధైర్య శాలి.
1883 జనవరి 7న అమృత్ సర్ లోని పట్టి గ్రామంలో సోహన్ లాల్ పాతక్ జన్మించారు. మంచి మెరిట్ స్టూడెంట్ గా ఉండే ఈయన ఆ తర్వాత తన చదువును మధ్యలోనే వదిలి వేశారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా చేరారు. అనంతరం కొంత కాలానికే ఆ ఉద్యోగం వదిలి లాహోర్ లో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో చేరారు. లాలా హర దాయల్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందారు. ఆయన స్థాపించిన వందేమాతరం ఉర్దూ పత్రికలో సోహన్ లాల్ ఉద్యోగిగా చేరారు.
అతి తక్కువ కాలంలోనే లాలా లజపతి రాయ్ కు సన్నిహితునిగా మారారు. సియామ్, అమెరికాకు వెళ్లారు. అక్కడ హర దయాల్ స్థాపించిన గదర్ పార్టీ తరఫున రహస్య ఉద్యమాన్ని నడిపారు. బర్మా, మలేషియా, సింగపూర్ లలో నిర్వహించిన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. మొదట్లో సింగపూర్ లో బ్రిటీష్ సేనలను గదర్ పార్టీ నేతృత్వంలోని సేనలు తరిమి కొట్టాయి. దీంతో ఈ తిరుగుబాటును అణచి వేయాలని పెద్ద ఎత్తున బలగాలను బ్రిటీష్ ప్రభుత్వం అక్కడకు పంపించింది. బర్మాలో తిరుగుబాటుకు నేతృత్వం వహించేందుకు సోహన్ లాల్ వెళ్లారు.
మయన్మార్ లో ఆయన్ని బ్రిటీష్ అధికారులు అరెస్టు చేశారు. తప్పు ఒప్పుకుని క్షమాపణ చెబితే శిక్షను రద్దు చేస్తామంటూ సోహన్ లాల్ ముందు గవర్నర్ ఓ ప్రతిపాదన పట్టారు. కానీ, దాన్ని తిరస్కరించారు. క్షమాపణలు చెప్పాల్సింది బ్రిటీష్ పాలకులేనన్నారు. ఆగ్రహం చెందిన వారు ఆయనకు ఉరిశిక్ష విధించారు.