మళ్లీ గెలిచేది మేమే.. తెలంగాణ సస్యశ్యామలం అయింది.. దేశానికే ఆదర్శంగా ఉన్నాం.. హ్యాట్రిక్ పక్కా.. ఇలా ఎన్నో ప్రవచనాలను రోజూ బీఆర్ఎస్ నేతలు వినిపిస్తున్నారు. బంగారు తెలంగాణ చేసిన మొనగాడు కేసీఆర్(KCR) అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. తెలంగాణ మోడల్ (Telangana Model) మంత్రం జపిస్తూ.. దేశమంతా విస్తరిస్తామని చెబుతున్నారు. కానీ, వాస్తవానికి.. వీరి మాటలకి ఎంతో సత్యదూరం ఉందని ఏదో ఒక ఘటన నిరూపిస్తోంది. తాజాగా కాటారం (Kataram) ప్రభుత్వ ఐటీఐ కాలేజీ వార్త ఒకటి వైరల్ అవుతోంది.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ, చాలా స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కాటారం ప్రభుత్వ ఐటీఐ కాలేజీ పరిస్థితి కూడా అంతే. ఇక్కడ మరుగుదొడ్లు లేక విద్యార్థినులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. వారి బాధకు అద్దం పడుతూ ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పరదా చాటున విద్యార్థులు వారి పరువును కాపాడుకుంటున్న ఆ దృశ్యం చూసిన ఎవరైనా అయ్యో అనకుండా ఉండరు.
అడుగడుగునా అభివృద్ధి అని చెబుతున్న ప్రభుత్వానికి విద్యార్థినులకు మరుగుదొడ్లు కట్టించాలనే సోయి లేదా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాటారం ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో మరుగుదొడ్లు లేని కారణంగా.. ప్రత్యామ్నాయంగా కళాశాల పక్కన ఓ తడక, దానిపై పరదాలుగా చీరలను ఏర్పాటు చేశారు. విద్యార్థినులు, మహిళా సిబ్బంది దీని చాటునే ఉపయోగించుకోవాల్సిన దుస్థితి. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
మరుగుదొడ్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని.. దీనివల్ల చాలామంది విద్యకు దూరం అవుతున్నారని అంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి.. విద్యార్థినుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస మౌలిక వసతులు లేని విద్యాలయాలను సందర్శించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.