మణిపూర్ (Manipur) లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. రావణాకాష్టంలా రగిలిపోయిన గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మే నెల మొదటి వారం నుంచి విద్వేషాగ్నిలో దహించుకుపోతోంది మణిపూర్. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. లెక్కలేనన్ని కుటుంబాలు నిలువ నీడలేనివయ్యాయి. స్వరాష్ట్రంలోనే శరణార్ధులుగా శిబిరాలలో తలదాచుకోవాల్సిన దుస్థితి అక్కడి ప్రజలది. రాజకీయంగా ఆరోపణలు నడుస్తున్నా.. పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో మణిపూర్ అల్లర్లపై విచారణ జరిగింది.
మణిపూర్ అల్లర్లపై అన్ని విషయాలు తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు (Supreme Court).. ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ షాలినీ జోషి, జస్టిస్ ఆశా మీనన్ ఇందులో సభ్యులుగా ఉంటారు. గీతా మిట్టల్ కమిటీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరించారు. మణిపూర్ హింసాకాండపై సమగ్ర విచారణ జరిపింది ఈ కమిటీ. బాధితులకు నష్టపరిహారం చెల్లింపులు, దాడుల నివారణ చర్యలు, పునరావాసం తదితర అంశాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం సుప్రీంకోర్టుకు మూడు నివేదికలను సమర్పించింది.
హింస వల్ల నలిగిపోతున్న ప్రజలకు పరిహారం ఇచ్చే పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది కమిటీ. ముగ్గురు సభ్యుల ప్యానల్ పనితీరును సులభతరం చేసేందుకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం.. మూడు నివేదిక కాపీలను సంబంధిత న్యాయవాదులందరికీ అందజేయాలని ఆదేశించింది. మణిపుర్ బాధితుల్లో ఒకరి తరఫు న్యాయవాది బృందా గ్రోవర్ ను ప్యానల్ కు సంబంధించిన సూచనలను క్రోడీకరించాల్సిందిగా తెలిపింది.