ఏ పూజ చేసినా ఏ వ్రతమాచరించినా తొలి పూజమాత్రం ఆ గణనాథుడి (Ganesh) కే చేయడం హైందవ సంప్రదాయం (Hindu Tradition). అడిగినంతనే అనుగ్రహించే దేవుడిగా విఘ్నాలను తొలగించే విభుడిగా విఘ్నేశ్వరుడు ప్రసిద్ధి. సంపత్ వినాయకుడిగా, లక్ష్మీ గణపతిగా, బాలగణేశ్ గా ఆలయాలు కొలువుదీర్చినవి కొన్నయితే స్వయంభూవుగా వెలసినవి మరికొన్ని. తెలంగాణా (Telangana) లో ప్రసిద్ధి చెందిన కొన్ని స్వయంభువు వినాయకులు విశేషాలు చూద్దాం.
బావిలో దొరికిన వినాయకుడు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో వెలిసిన ఈ గణపతికి రెండు శతాబ్ధాల చరిత్ర ఉంది. ఈ గణనాధుడు ఒక బావిలో దొరికాడని ఇక్కడి స్థానికులు చెప్తుంటారు. రెండు శతాబ్దాల కిందట..ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతంలో ఓ బావిలో ఈ విగ్రహం దొరికిందని ఆలయానికి వచ్చిన భక్తులకు పూజారులు కథగా వినిపిస్తుంటారు. ప్రధాన ఆలయంలో శివుడు, అమ్మవారు, వేంకటేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయుడు, శనైశ్చరుడు, రాహు-కేతు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.
జిల్లేడు గణపయ్య
శ్వేతార్కం అనగా తెల్ల జిల్లేడు అని అర్థం. తెల్ల జిల్లేడును గణపతికి ప్రతి రూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం వంద సంవత్సరాల వయసున్న జిల్లేడు మొక్క వేరులో గణపతి ఆకృతి వస్తుందని చెబుతారు. వరంగల్ పట్టణం కాజీపేటలోని గణపతి ఇలా వేరులో వెలిసిన దేవుడే.
30 అడుగుల ఏకశిల గణేషుడు
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో స్వయంభువుగా వెలిశాడు ఏకశిల వినాయకుడు. ఐశ్వర్య గణపతిగా పేరుపొందిన ఈ గణనాథుడి ఎత్తు 30 అడుగులు. దేశంలో ఎత్తయిన వినాయకుడి ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదని చెబుతారు. వెయ్యి సంవ్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పశ్చిమ చాళుక్య రాజైన తైలపుడు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.
సింధూర గణనాథుడు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశగా కొలువై ఉన్నాడు రేజింతల్ సిద్ధి వినాయకుడు. మిగతావాటికి భిన్నంగా సింధూరం ఈ వినాయకుడికి అభిషేకం చేస్తారు. సుమారు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ స్వయంభువు వినాయకుడి విగ్రహం ఏటా నువ్వు గింజంత పరిమాణం పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.