తైవాన్ రాజధాని తైపీలో(Taipi) బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం(Earth quake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. భూకంపం ధాటికి తైపీలోని అనేక భవనాలు నేలమట్టం అయినట్లు సమాచారం. తూర్పు తైవాన్ లోని హువాలియన్ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో 34.8కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) తెలిపింది.
ప్రస్తుతం ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే,భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైలు సేవలను నిలిపివేశారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
భూకంపం ధాటికి కొండచరియలు సైతం విరిగిపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం ధాటికి విద్యుత్ ప్లాంట్లు దెబ్బతినడంతో దేశంలో పవర్ సప్లయ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా, తైవాన్(TAIWAN) భూకంపం ధాటికి జపాన్, ఫిలిప్పిన్స్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలో 3 మీటర్ల కంటే ఎత్తులో అనగా దాదాపు 10 అడుగుల మేర అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తైవాన్ లో ఇప్పుడు వచ్చిన భూకంపం గత 25ఏళ్లలో ఇదే అతిపెద్దది అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కాగా, తైవాన్ దేశం తమ భూభాగమే అని చైనా కొంతకాలంగా క్లైయిమ్ చేస్తున్న విషయం తెలిసిందే.