ఇన్నాళ్లు టమాటా మీద పెంచుకున్న కోపం తగ్గించుకోవాల్సిన సమయం వచ్చింది. అధిక ధరల సాకుతో సామాన్యుణ్ని మర్చిపోయి చెట్టెక్కి కూర్చుంది. ప్రస్తుతం పంథాను మార్చుకుని మధ్య తరగతివాడి మొహం చూసింది.
గత రెండు నెలలుగా భీష్మించుకుని కూర్చున్న టమాటా బింకం మానింది. నేలకు దిగివచ్చింది. గత వారం రోజుల క్రితం బహిరంగ మార్కెట్లో డబుల్ సెంచరీతో రూ.200 కిలో ఉన్న టమాటా… ఇప్పుడు రైతు బజార్లో రూ.100లోపే లభిస్తోంది.
చాలా కాలంగా టమాటాకు దూరమైన భోజన ప్రియులు ఇన్నాళ్లకు గుర్తొచ్చామా అంటూ ఇష్టంగా తెచ్చుకొని మరీ కూరల్లో వేస్తున్నారు హైదరాబాద్(Hyderabad) మెహిదీపట్నం(Mehadipatnam )రైతుబజార్లో సోమవారం కిలో టమాటా రూ.63లకే లభించిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
అలాగే గుడిమల్కాపూర్ (Gudimalkapur) మార్కెట్ రోడ్డులో కిలో టమాటా(గోటి) రూ.50లకు వస్తోందని వినియోగదారులు అంటున్నారు.బయట మార్కెట్లు, రోడ్లపై ఆటోలో తీసుకొచ్చిన మొదటి రకం టమాటా రూ.90 కిలో నిర్ణయించి వర్తకులు అమ్ముతున్నారు.
ఈ నెల చివరి నాటికి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు వ్యాపారస్థులు అంచనా వేస్తున్నారు. కొన్నాళ్లలో టమాటా టమాటా అవుతుంది.