మనదేశంలో స్వాతంత్య్రానికి ముందు ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలు (MOVEMENTS) జరిగాయి. మనల్ని 200 ఏళ్ల పాటు పాలించిన బ్రిటీష్ వారు మన దేశంలో వర్తకం కోసం వచ్చి.. ఆ తర్వాత డివైడ్ అండ్ రూల్ తీసుకొచ్చారు.కులం, మతం పేరుతో మనుషుల మధ్య వైషమ్యాలు సృష్టించి తమలో తామే కొట్టుకునేలా చేసి అప్పుడు నెమ్మదిగా రాజ్యాధికారం చేయడం మొదలెట్టారు. అలా దేశం మొత్తం వారి పాలన అమలయ్యేలా చేశారు. ఆ తర్వాత రాజ్యాలు, సంస్థానాలకు ఆక్రమించుకుని, వారి సామంతులుగా మార్చేశారు. పన్నుల పేరుతో శ్రమదోపిడీ, వెట్టిచాకిరీ చేయించేవారు.
వ్యాపారం కోసం వచ్చి భారతీయులను దోపిడీ చేస్తున్న బ్రిటీష్ వారి నిరంకుశత్వాన్ని సహించని ఓ వ్యక్తి ఆదివాసీల సాయంతో ఒక పెద్ద ఉద్యమాన్నే నడిపి తెల్లవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు.ఆయనే మోతీలాల్ తేజావత్ (MOTILAL TEJAVATH).. అతనొక విప్లవ శక్తిగా మారాడు. అనతికాలంలోనే పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు. అది సహించని బ్రిటీష్ వాళ్లు సృష్టించిన మారణహోమంలో మోతీలాల్ సహా ఏకంగా 3వేలకు పైగా ఆదివాసీలు అమరులయ్యారు.ఈ మారణహోమానికి సంబంధించిన గుర్తులను మన చరిత్ర పుటల్లో లేకుండా చేశారు ఆనాటి పాలకులు.ఈ ఘటన గురించి తెలిసిన వారు కూడా పెద్దగా ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారు. అయితే, 73వ గణతంత్ర దినోత్సవం 2022లో వందేళ్లు పూర్తయిన సందర్భంగా ‘పల్చిటారియా మారణకాండ’పై గుజరాత్ టాబ్లాయిడ్ ఓ వ్యాసం ప్రచురించింది. అందులో ఏముందంటే..
మోతీలాల్ తేజావత్ 1886లో రాజస్థాన్‌లోని కొలియారిలో జన్మించాడు. అప్పట్లోనే 5వ తరగతి వరకు చదువుకున్న మోతీలాల్.. ఝదోల్ తహసీల్‌లో పనిచేశాడు. ఆ కాలంలోనే బ్రిటిష్ వారు ప్రజల నుంచి అధికంగా ట్యాక్సులు కలెక్ట్ చేయడాన్ని చూసి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటికే ఊపిరిపోసుకుంటున్న ‘బిజోలియా’(BIJOLIA MOVEMENT) ఉద్యమం మోతీలాల్పై ప్రభావం చూపింది. దీంతో ఆ ఉద్యమానికి మద్దతుగా కరపత్రాలను పంపిణీ చేయడం మోతీలాల్ ప్రారంభించాడు.
బ్రిటీష్ వారు రైతులు, ప్రజల నుంచి అన్యాయంగా పన్నులు వసూలు చేయడాన్ని అందరికీ వివరిస్తూ వారిలో చైతన్యం కలిగించాడు. ముఖ్యంగా ఆదివాసీల అణచివేతకు వ్యతిరేకంగా నిలబడ్డాడు.దీంతో ఆదివాసీలంతా మోతీవాల్ వెనుక నిలబడ్డారు. ఏకి పేరుతో ప్రారంభమైన ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని తెలుసుకున్న బ్రిటీషర్స్..1922 మార్చి 07న మేజర్ హెచ్‌జీ సుట్టన్ నేతృత్వంలోని బలగాలు మోతీలాల్ తేజావత్ ఉన్న పల్చిటారియా గ్రామంలో (ప్రస్తుతం సబర్కాంత జిల్లా దధ్వావ్ విలేజ్‌గా పేరు మార్చబడింది) గుమిగూడిన ఆదివాసీలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 1200 మంది మరణించారు.
సరిగ్గా నెల తర్వాత 08 మే 1922న భులా, బలోహియా గ్రామాలను మరోసారి చుట్టిముట్టిన బ్రిటీష్ బలగాలు అక్కడ ఉన్న ఇళ్ళకు నిప్పంటించాయి. బయటకు పరుగులు తీసిన జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి.ఈ మారణకాండలో 1800 మంది అమాయక ఆదివాసీలు మరణించారు. 640ఇళ్ళు దగ్ధమయ్యాయి. ఈ రెండు మారణహోమాలతో మోతీలాల్ తేజావత్ ప్రారంభించిన ‘ఏకీ’ ఉద్యమానికి (EKI MOVEMENT) తెరపడింది.
అయితే, మోతీలాల్ మరణానికి ముందు మహత్మా గాంధీ(MAHATMA GANDHI) మాట్లాడిన మాటలు యంగ్ ఇండియాలో ఒక వ్యాసం రూపంలో వచ్చింది. అందులో గాంధీ ఏమన్నారంటే..
‘ఉదయ్‌పూర్‌కు చెందిన మోతీలాల్ పంచోలీ అనే వ్యక్తి నా శిష్యుడిగా చెప్పుకుంటున్నట్లు తెలిసింది. అతను రాజపుతానా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో లేని సంయమనం గురించి బోధిస్తాడని నేను వింటున్నాను. అతని చుట్టూ ఆయుధాలతో కూడిన గుంపు ఉన్నదని విన్నాను. వారితో కలిసి అతనో ఒక రాజ్యాన్ని స్థాపించినట్లు తెలిసింది.అతని అభిమానులు విధ్వంసక పనులు చేసినట్లు విన్నాను. నాకు ఇలాంటి శిష్యులు లేరని ప్రజలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను’ భారతీయప్రజలకు మెసేజ్ ఇచ్చినట్లు తెలిసింది.
మనదేశంలో బ్రిటీష్ వారు సృష్టించిన మారణహోమాల్లో ‘జలియన్‌వాలా బాగ్’ కంటే భయంకరమైన ఈ ఊచకోత గురించి గుజరాత్ లేదా రాజస్థాన్ చరిత్రపుటల్లో రికార్డులు లేవు. అయితే, గుజరాత్ సీఎంగా ఉన్న టైంలో ప్రస్తుత ప్రధాని మోడీ(PM MODI) ఈ మారణకాండను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ‘సబర్కాంత’ ఈ భయానక ఊచకోత జరిగిన ప్రదేశంలోనే ‘మోతీలాల్ తేజావత్’ స్మారక చిహ్నాన్ని గుజరాత్ ప్రభుత్వం నిర్మించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ‘వీరభూమి’ అని పిలుస్తున్నారు.