జనరల్ భక్త్ ఖాన్ (General Bhakth Khan)… చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడిన గొప్ప దేశ భక్తుడు. ఈస్టిండియా కంపెనీ (East India Company)లో సుబేదార్ పదవిని వదలి సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న గొప్ప యోధుడు. బ్రిటీష్ సేనలను ఢిల్లీ సరిహద్దుల నుంచి తరిమి కొట్టిన గొప్ప వీరుడు. మొఘల్ రాజు బహదూర్ షా లొంగిపోయినప్పటికీ లక్నో సేనలతో కలిసి చివరి వరకు బ్రిటీష్ వారితో పోరాటం చేశాడు.
జనరల్ భక్త్ ఖాన్ 1797లో రోహిల్ ఖండ్ ప్రాంతంలోని బిజ్నోర్ ప్రాంతంలో జన్మించారు. ఈస్టిండియా కంపెనీ పాలనలో సుబేదార్ గా పని చేశారు. కంపెనీలో అశ్వదళం, ఫిరంగి దళాలలో పని చేసి మంచి నైపుణ్యాన్ని పొందారు. ఆ తర్వాత మొదటి ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. 1857 మే 10న మీరట్ లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభం అయింది.
ఈ తిరుగుబాటు కాస్త దేశ మంతటికి పాకింది. సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో జనరల్ భక్త్ ఖాన్ బ్రిటీష్ వారికి ఎదురు తిరిగాడు. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ కు మద్దతుగా భక్త్ ఖాన్ ఢిల్లీకి బయలు దేరాడు. భక్త్ ఖాన్ ఆధ్వర్యంలోని బెంగాల్ పదాతి దళానికి చెందిన అశ్విక దళం, ఫిరంగి దళం చేరికతో స్థానిక దళాల్లో ఉత్సాహం కలిగింది. వారంతా కలిసి బ్రిటన్ సైన్యాన్ని ఢిల్లీ సరిహద్దుల నుంచి తరిమి కొట్టాయి.
1జూలై 1857న పెద్ద ఎత్తున సైన్యంతో భక్త్ ఖాన్ ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ స్థానిక సైన్యం ఢిల్లీని చేజిక్కిచ్చుకుని బహదూర్ షాను చక్రవర్తిగా ప్రకటించింది. దీంతో ఆ సైన్యంలో భక్త్ ఖాన్ కీలక అధికారిగా మారారు. ఆ తర్వాత రాజ్యంలో పన్నుల వసూలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం భక్త్ ఖాన్ ఢిల్లీ నుంచి దూరంగా వెళ్లాల్సి వచ్చింది. ఇదే అదనుగా భావించిన బ్రిటన్ సైన్యం ఢిల్లీపై దాడి చేసింది.
14 సెప్టెంబర్ 1857న బ్రిటీష్ వాళ్లు కాశ్మీరీ గేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బహదూర్ షా ఢిల్లీ విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో బహదూర్ షాను పట్టుకుని సెప్టెంబర్ 20న అరెస్టు చేశారు. ఆ తర్వాత లక్నో, షహజాన్ పూర్ తిరుగుబాటుదారులతో కలిసి బ్రిటీష్ వారిపై భక్త్ ఖాన్ యుద్దాన్ని కొనసాగించాడు. చివరకు యుద్ధంలో గాయపడి 1859లో నేపాల్ లో మరణించాడు.