Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
గద్దర్ మరణం రాష్ట్ర ప్రజలందరికీ ఆవేదనను కలిగించిందని మావోయిస్టు పార్టీ తెలిపింది. గద్దర్(Gaddar) అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు వుండరని.. ఆయన మరణం తమను తీవ్రంగా భాదకు గురి చేసిందని చెప్పింది. గద్దర్ కు ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియ జేస్తున్నట్టు లేఖ విడుదల చేసింది. నగ్జల్బరి, శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో తెలంగాణ(Telangana)లో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు.
పాటలు(Songs), నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను గద్దర్ చైతన్య పరిచారని తెలిపింది మావోయిస్టు పార్టీ. జన నాట్య మండలి ఏర్పాటులో ఆయన కృషి ఉందని.. 1972 నుండి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగిందని వివరించింది. 4 దశబ్దాలు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డారని.. 1972 నుండి 2012 వరకు మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగారని తెలిపింది. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పని చేశారని చెప్పింది.
దోపిడీ పాలకులు బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవకారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా చేసిన సందర్భంలో వాటి స్వాధీన ఉద్యమానికి గద్దర్ నాయకత్వం వహించారని లేఖలో పేర్కొంది మావోయిస్టు పార్టీ. సాంస్కృతిక రంగం అవసరాన్ని పార్టీ గుర్తించి తనను బయటకు పంపించి జన నాట్య మండలిని అభివృద్ధి చేయించిందని చెప్పింది. 1997లో గద్దర్ పై కాల్పులు జరిపారని.. ఐదు తూటాలు శరీరంలోకి దూసుకెళ్ళి ప్రాణ ప్రాయ స్థితి నుండి బయట పడ్డారని వివరించారు.
గద్దర్ చివరి కాలంలో పార్టీ నింబంధనావళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలవడంతో తమ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చిందని తెలిపింది. ఈ క్రమంలోనే 2012లో పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారని.. దాన్ని హైకమాండ్ ఆమోదించిందని లేఖలో వివరించింది. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గద్దర్ ఆ తరువాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నారని.. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో తెలిపారు.




