Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
– నగరిలోనూ అభ్యర్థి మార్పు?
– రోజా స్థానంలో చక్రపాణిరెడ్డి అంటూ ప్రచారం
ఆంధ్రాలో ఎలక్షన్ హీట్ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం మార్చిలో ఎన్నికలు ఉండాలి. కానీ, ఫిబ్రవరిలోనే జరిగే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా వైసీపీ (YCP) లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు ఆపార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy). ఎమ్మెల్యేల స్థానాలను మార్చేస్తున్నారు. దాదాపు 60కి పైగా స్థానాల్లో మార్పులు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆర్కే రోజా (RK Roja) అంశం రీసౌండ్ ఇస్తోంది. ఈమెకు టికెట్ ఇస్తారా? వేరే చోటకి మారుస్తారా? లేక, పోటీకి దూరం పెడతరా? ఇలా అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం నగరి(Nagari) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు రోజా. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే.. ఈసారి రోజాకు టికెట్ దక్కే ఛాన్స్ లేనట్టేననే ప్రచారం జోరుగా సాగుతోంది. నగరి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన రోజాకు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందన్న కారణంగా సీఎం జగన్ టిక్కెట్ నిరాకరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే, నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలతో రోజాకు సఖ్యత లేదని.. ఐదు మండలాల నాయకులు ఆమెను వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రోజాకు వ్యతిరేకంగా ఉన్నారని అనుకుంటున్నారు.
రోజా మాత్రం తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని.. తనకు కాక సీటు ఎవరికి ఇస్తారని అంటున్నారు. టిక్కెట్ రాదని చెప్పి టీడీపీకి వైసీపీ అభ్యర్థులను మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు రోజా. అందుబాటులో ఉన్నాం కాబట్టే రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రులు అయ్యామని, 175 సీట్లకి 175 పక్కాగా వైసీపీ గెలుస్తుందని ధీమాగా చెబుతున్నారు. కానీ, ఆమె ఇంకో మాట కూడా అంటున్నారు. నగరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తాను జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేస్తున్నారు రోజా.
మరోవైపు, నగరి నుంచి వైసీపీ అభ్యర్థిగా శ్రీశైలం దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించారని సమాచారం. ఈ విషయం దాదాపు ఫైనల్ అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. నగరిలో రోజాకు ఎదురుగాలి వీస్తున్నదనీ, ప్రజల్లో వ్యతిరేకతే కాకుండా ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారన్న నివేదికల ఆధారంగా చక్రపాణిరెడ్డిని బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు, నగరి నుంచి రోజాను మార్చడమే కాదు.. ఆమెకు ఎక్కడ నుంచీ పోటీ చేసే అవకాశం లేదని కూడా అనుకుంటున్నారు. పార్టీలో సముచిత హోదా కల్పించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.