Featured posts
గ్రూప్-2 (Group-1) అభ్యర్థి ప్రవళ్లిక ఆత్మహత్య నేపథ్యంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఈ ఇష్యూపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. అశోక్ నగర్ (Ashok Nagar) లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవళ్లిక తరఫున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నాయని అన్నారు. అయనా కూడా సీఎం కేసీఆర్ (CM KCR) చెవికి వినబడటం లేదని మండిపడ్డారు. ఈ పెద్ద మనిషి పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదన్నారు.
ఈ రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదని విమర్శించారు రేవంత్. ప్రవళ్లిక సూసైడ్ లెటర్ ను గమనిస్తే ఇది అర్థమవుతోందన్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించాలని.. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు రేవంత్. ఈ ట్వీట్ కు విద్యార్థులు హాస్టల్ ఎదుట ఆందోళన చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు.
ఇక, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందిస్తూ.. ప్రవళ్లిక ఆత్మహత్యపై ఆందోళన చేస్తూ రోడ్డుమీదకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని ఖండించారు. ఈ ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. విద్యార్థులకు మద్దతుగా రోడ్డుమీదకు వచ్చిన బీజేపీ నేతలపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఆత్మహత్యలు వద్దు ఆగ్రహావేశాలతో తిరగబడదామని విద్యార్థులకు పిలుపునిచ్చారు సంజయ్. ఈ అరాచక పాలనలో మరో ఆడబిడ్డ ఆయువు తీసుకోవడం గుండెలు పిండేస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. ఆశ, ఆశయం, ఉరకలెత్తిన ఉత్సాహం, ఉరిమి తరిమిన యువత పౌరుషంతోనే తెలంగాణ సాకారం అయిందని.. అమరుల ఆకాంక్షల సారథులైన మీరు నిరాశపడితే.. ఆత్మబలిదానాలు చేసిన వారిని అవమానించడమేన్నారు. నిరంకుశత్వాన్ని నిగ్గుతేల్చే నిప్పు కణికల్లా ఎగిసిపడాలని పిలుపునిచ్చారు. ఈ అరాచక పాలనను గద్దె దించి సత్తా చాటుదామన్నారు బండి సంజయ్.
తెలంగాణలో పోటీ పరీక్షల్లో వరుస లీకులు, వాయిదాలతో విరక్తి చెంది ప్రవళ్లిక అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. దీనికంతటికీ కేసీఆర్ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ కారణమని విమర్శించారు. గత మార్చి నెలలోనే బోర్డును రద్దు చేసి, కొత్త బోర్డును నియమించి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదన్నారు. కానీ, కేసీఆర్, కేటీఆర్ మొండిగా బోర్డును కాపాడారని మండిపడ్డారు. కనీసం ఇప్పుడైనా గవర్నర్ తన ప్రత్యేక అధికారాలను వినియోగించి వెంటనే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని కోరారు. విద్యార్థి, నిరుద్యోగులను కాపాడుకునే బహుజన రాజ్యం త్వరలోనే రాబోతోందని.. దయచేసి మీ విలువైన ప్రాణాలను తీసుకోకండని సూచించారు ఆర్ఎస్పీ.