షహీద్ రాణా బేణి మధో (Shaheed Rana Beni Madho)… శంకర్ పూర్ ఎస్టేట్ (ప్రస్తుత రాయ్ బరేలీ) పాలకుడు. భారత వృద్ధ సింహం షహీద్ కున్వర్ సింగ్ మనవడు. అవధ్ (Avadh) ప్రాంతంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన గొప్ప పోరాట యోధుడు. బ్రిటీష్ సామ్రాజ్య పునాదులను నాశనం చేసి వారిని దేశం నుంచి వెళ్లగొట్టడమే తన ఏకైక లక్ష్యమని ప్రకటించిన గొప్ప యోధుడు.
1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో అవద్ ప్రాంతంలోని గొప్ప వీరుల్లో ఆయన ఒకరు. రాజపుత్రుల్లోని బైస్ వంశానికి చెందిన వారు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చిన అవద్ నవాబ్ అలీషా బేణి మధోను జాన్ పూర్, అజమ్ ఘర్ ప్రాంతాలకు పాలకునిగా నియమించారు. దీంతో పాటు బేణి మధోకు సిర్మౌ రాణా బహదూర్ దిలేర్ జంగ్ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు.
సిపాయిల తిరుగుబాటులో భాగంగా 25 వేల మంది సైనికులతో కలిసి వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆంగ్లేయులతో జరిగిన పోరాటంలో బ్రిటీష్ అధికారి మేజర్ గాల్ను బేణి మధో హత మార్చారు. కొన్ని రోజుల్లోనే బేణి మధో బ్రిటీష్ పాలకులకు కంటిలో నలుసులా మారారు. దీంతో ఆయన్ని ఎలాగైనా పట్టుకుని ఉద్యమాన్ని అణచి వేయాలని బ్రిటీష్ పాలకులు నిర్ణయించారు.
మధోను పట్టుకునేందుకు లార్డ్ క్లైడ్, హోప్ గ్రాంట్, బ్రిగేడియర్ వెలెగ్, ఆల్ఫ్రెడ్ హార్స్ఫోర్డ్ ల నాయకత్వంలో సేనలను పంపించారు. ఈ సేనలు మధోను అష్ట దిగ్బందం చేయగా చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన సైన్యం క్షీణించింది. ఈ క్రమంలో బ్రిటీష్ వారితో జరిగిన యుద్దంలో ఆయన వీర మరణం పొందారు.