జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు నోటీసులు ఇచ్చారు విశాఖ పోలీసులు (Police). వారాహి యాత్రలో భాగంగా గురువారం విశాఖ (Vizag) లో పర్యటించి మాట్లాడారు పవన్. ఆయన సభలో చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని.. నోటీసులు ఇచ్చారు పోలీసులు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని.. ఇలా వ్యవహరించవద్దని అందులో పేర్కొన్నారు. విశాఖ తూర్పు ఏసీపీ (ACP) పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి.
పవన్ ఏమన్నారంటే..?
జగన్ ని స్మగ్లర్ వీరప్పన్ తో పోల్చారు పవన్. అడవుల్లో గిరిజనులను వీరప్పన్ వాడుకున్నట్లు వలంటీర్లను జగన్ (Jagan) వాడుకుంటున్నారని అన్నారు. ప్రజలకు అన్యాయం చేస్తున్నారని.. రాష్ట్రంలో అరాచకం ఆగాలంటే.. అభివృద్ది జరగాలంటే జగన్ పోవాలని చెప్పారు. హైదరాబాద్ లో ఎక్కువగా దౌర్జన్యాలు చేయడం వల్లే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారని ఇందులో జగన్ ముఖ్యమైన వ్యక్తి అని ఆరోపించారు పవన్. వైసీపీని తన్ని తరిమే వరకూ తాను నిద్ర పోనని చెప్పారు. హలో ఏపీ.. బై బై వైసీపీ అంటూ ప్రసంగం ముగించారు.
పవన్, చంద్రబాబుపై సీఎం సీరియస్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్సార్ సున్నా వడ్డీ నాలుగో విడత నిధులను విడుదల చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 14ఏళ్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మనిషి పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. ప్రజలకు ఒక్క మంచి కూడా చేయని వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి దత్తపుత్రుడు పవన్ ఎందుకు తాపత్రయ పడుతున్నారని ప్రశ్నించారు. తాను సొంతంగా సీఎం కావాలని కాకుండా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.
మంత్రుల ఎదురుదాడి
దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీనే జగన్ ని ఏమీ చేయలేకపోయారని.. ఆటలో అరటి పండు లాంటి పవన్ ఏం చేస్తారని సెటైర్లు వేశారు మంత్రి రోజా (Roja). ‘‘చంద్రబాబు అరవమంటే అరుస్తాడు, కరవమంటే కరుస్తాడని పవన్ ను ఉద్దేశించి అన్నారు. పవన్ కు ఓ జెండా అజెండా లేదని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదవడమే ఆయన పని అని ఎద్దేవ చేశారు. పవన్ ఆయన దత్త తండ్రి చంద్రబాబు మాత్రమే అధికారంలో ఉండాలన్న ఆలోచనతో విశాఖలో ప్రసంగించారని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జనసేన పార్టీ గురించి గానీ.. పవన్ రాజకీయంగా ఎదగాలన్న ఆలోచన ఆయన ప్రసంగంలో లేదని చెప్పారు.