అయోధ్య (Ayodhya) రామ మందిరంలో ‘రామ్ లల్లా’విగ్రహ ప్రాణ ప్రతిష్టను వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్నారు. ఇప్పటికే అయోధ్య రాముల వారి దర్శనం కోసం భక్తులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల కోసం భారత రైల్వే (Indian Railway) గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది.
ఆలయ ప్రారంభోత్సవ రోజు నుంచి 100 రోజుల వరకు భక్తుల సౌకర్యార్థం సుమారు 1000 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. ఈ రైళ్లు జనవరి 19 నుంచి ప్రారంభం అవుతాయని చెప్పింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణె, కోల్ కతా, నాగ్ పూర్, లక్నో, జమ్ముతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఈ రైళ్లు నడుస్తాయని వివరించింది.
భక్తుల డిమాండ్ కు అనుగుణంగా ఈ రైళ్లను నడుపుతామని అధికారులు తెలిపారు. దీనికి అనుగుణంగా అయోధ్యలో రైల్వే స్టేషన్ ను పునరుద్దరిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ఇప్పటికే ఎయిర్ డ్రోమ్ లైసెన్సులు మంజూరు కావడం, మొదటి ఫేజ్ నిర్మాణం పూర్తి కావడంతో అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
అయోధ్య విమానాశ్రయంలో డిసెంబర్ 30న మొదటి విమానం టేకాఫ్ తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 6 నుంచి పూర్తి స్థాయిలో రెగ్యులర్ గా విమానాలు నడుస్తాయని పేర్కొన్నాయి. అయోధ్య ఎయిర్ పోర్టు అన్ని వాతావరణ పరిస్థితుల కోసం ప్రజా వినియోగ కేటగిరీలో ఏరోడ్రోమ్ లైసెన్స్ ను డీజీసీఏ ఇండియా డైరెక్టర్ జనరల్ విక్రమ్ దేవ్ దత్ నుంచి ఏఏఐ ఛైర్మన్ సంజీవ్ కుమార్ అందుకున్నట్టు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.