ఇజ్రాయెల్ (Israel)- హమాస్ (Hamas) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేటితో ముగియనుంది. చివరి రోజున మరి కొంత మంది బందీలను హమాస్, ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. మరోవైపు ఇరు దేశాల మధ్య మరి కొంత కాలం కాల్పుల విరమణ కొనసాగాలని మధ్యవర్తిత్వ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలపై కాల్పుల విరమణ పొడిగింపుపై ఒత్తిడి తెస్తున్నాయి.
ఒప్పందంలో భాగంగా 12 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. అందులో 10 మంది ఇజ్రాయెల్, ఇద్దరు థాయ్ లాండ్ దేశస్తులు ఉన్నారు. మాస్కులు ధరించిన సాయుధులైన జిహాదీ వ్యక్తులు బందీలను ఓ ప్రత్యేక వాహనంలో ఈజిఫ్టు సరిహద్దు ప్రాంతం రఫా వద్ద రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు అటు ఇజ్రాయెల్ కూడా 30 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇప్పటి వరకు గాజా నుంచి 60 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. అందులో 20 మంది థాయ్‌లాండ్ పౌరులు, ఒక ఫిలిప్పిన్ పౌరులు, మిగతా ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. అదే విధంగా అటు ఇజ్రాయెల్ కూడా ఇప్పటి వరకు 180 మంది పాలస్తీనా పౌరులను విడుదల చేసింది.
ఇది ఇలా వుంటే ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల పొడిగింపు విషయంపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సంది పొడిగింపు విషయంపై చర్చించేందుకు అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA), ఇజ్రాయెల్ మొసాద్ నాయకులు దోహాలో ఖతార్ ప్రధాన మంత్రితో సమావేశమైనట్టు తెలుస్తోంది. అటు అంతర్జాతీయ సంస్థలు కూడా కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్నాయి.