బ్రెజిల్‌లోని అమెజాన్ అడవిలో విమానం కుప్పకూలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. ఉత్తర అమెజాన్‌లోని బార్సిలోస్ ప్రావిన్స్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. విమానంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
ప్రమాదానికి గురైన ఎంబ్రేయర్ PT-SOG విమానం మనౌస్ నుంచి బయలుదేరిందని అమెజానాస్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా తెలిపారు. 12 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్ల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు విల్సన్ లిమా.భారీ వర్షాలు కారణంగా విమానం కూలినట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ప్రమాద స్థలానికి ఓ బృందాన్ని పంపింది బ్రెజిలియన్ వైమానిక దళం.
విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగిందని అక్కడి మీడియా వెల్లడించింది. బ్రెజిల్ కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ఉత్తర అమెజాన్ రాజధాని మనౌస్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఘటనా స్థలం ఉన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన విమానం మనౌస్ ఎయిర్ టాక్సీ సంస్థకు చెందిందని బ్రెజిల్ సివిల్ ఎవిగేషన్ ఏజెన్సీ తెలిపింది.