సిక్కిం (Sikkim )లో భారీ వరదలు (Floods) సంభవించాయి. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 19కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు జవాన్లు (Soldiers) కూడా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు వరదల్లో 103 మంది గల్లంతు అయినట్టు పేర్కొన్నారు. అందులో 16 మంది జవాన్లు ఉన్నట్టు అధికారులు చెప్పారు. సుమారు 3000 సందర్శకులు వరదల్లో చిక్కుకున్నట్టు చెప్పారు.
ఉత్తర సిక్కింలోని తీస్తా నది పరివాహక ప్రాంతంలోని ఎల్ హోనాక్ సరస్పు ఉప్పొంగడంతో వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. వరదల నేపథ్యంలో టూరిస్టులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. తాజాగా వచ్చిన వరదలతో సిక్కి ప్రాంతంలోని ఆర్మీ క్యాంపులోని పేలుడు పదార్థాలు, మందు గుండు సామగ్రి కొట్టుకు పోయాయి.
లాచెన్, లాచుంగ్ ప్రాంతాల్లో చిక్కుకున్న 3000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతానికి మోటార్ సైకిళ్లపై వెళ్లిన 3,150 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకున్నట్టు తెలిపారు. వారందరినీ హెలికాప్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించనున్నట్టు సిక్కిం చీఫ్ సెక్రటరీ విజయ్ భూషణ్ పాతక్ వెల్లడించారు.
వరదల్లో కొట్టుకు పోయిన జవాన్లకు రక్షించేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టింది. బుధవారం సంభవించిన వరదలతో చుంగ్ థంగ్ డ్యామ్ ధ్వంసం అయింది. మంగన్ ప్రాంతంలో 8 వంతెనలు ధ్వంసమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో త్రిశక్తి పోలీసులు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వరదల నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందులను తొలగించేందుకు తమ అధికారులు శ్రమిస్తున్నట్టు సిక్కిం ముఖ్య మంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు.