పార్లమెంట్ (Parliament) పై ఉగ్రదాడికి నేటితో 22 ఏండ్లు పూర్తయింది. ఈ దాడిలో 9 మంది వీర జవాన్లు అమరులయ్యారు. వారికి దేశం మొత్తం ఈ రోజు నివాళి అర్పిస్తోంది. పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమర జవాన్లకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్‌తో పాటు ప్రధాని మోడీ (PM Modi), లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఘన నివాళులర్పించారు.
అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్‌లు అమర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు.
అమర వీరుల కుటుంబ సభ్యులతో ప్రధాని మోడీ ఈ సందర్బంగా ముచ్చటించారు. 2001లో మన పార్లమెంట్‌పై దాడి సమయంలో తమ ప్రాణాలను అర్పించిన సాహసోపేతమైన భద్రతా సిబ్బందిని స్మరించుకుంటున్నామని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ట్వీట్ లో తెలిపారు. వారి అత్యున్నత త్యాగానికి భారత్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు.
ఉగ్రవాదం అనేది ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతికి అడ్డంకిగా మారిన ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో దేశాలన్నీ ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. అంతకు ముందు అమర జవాన్లకు ఘన నివాళులు అర్పిస్తున్నామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆపద సమయంలో వారు చూపిన ధైర్యం, వారి త్యాగం దేశంలో పౌరుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
13 డిసెంబర్ 2001న ఏం జరిగింది…!
2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాలు జరిగాయి. ఆ రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఓ తెల్లరంగు అంబాసిడర్ కారులో ఐదుగురు ఉగ్రవాదులు గేట్ నంబర్ 12 నుంచి దూసుకు వచ్చారు. ఆ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే కారు వెనకాలే పరుగెత్తాడు. చూస్తుండగానే ఉపరాష్ట్రపతి వాహనాన్ని ఆ కారు ఢీ కొట్టింది.
వెంటనే ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిరాయుధులైన సెక్యూరిటీ గార్డులు మరణించారు. కాల్పుల శబ్దం విన్న సీఆర్పీఎఫ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, ప్రమోద్ మహాజన్ లాంటి ప్రముఖ నేతలంతా అప్పుడు పార్లమెంట్ లోనే ఉన్నారు. ఇంతలో ఓ ఉగ్రవాది గేట్ నంబర్ 1 నుంచి లోపలికి ప్రవేశించేందుకు యత్నించాడు.
ఉగ్రవాదిని గమనించి భద్రతా బలగాలు అతన్ని మట్టుపెట్టాయి. మిగతా నలుగురు ఉగ్రవాదులు గేట్ నంబర్ 4 నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అలర్ట్ అయిన భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించాయి. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఈ కేసులో అఫ్జల్ గురు మరణశిక్ష విధించారు. 2013న తీహార్ జైలులో అఫ్జల్ గురును ఉరితీశారు.