బస్సులలోనూ, ట్రైన్ లలోనూ..చిల్లర గొడవలు వస్తూనే ఉంటాయి. ఈ విషయంలో ఎవరో ఒకరు తగ్గాలి. ఎక్కువ శాతం ప్రయాణికులే తగ్గుతూ ఉంటారు. చిల్లర లేకపోవడం జన్యూన్ అయితే పరవాలేదు.
కానీ కొంతమంది కండక్టర్లు,రైల్వే క్లర్కులు ఉద్దేశ పూర్వకంగా చిల్లర లేదంటారు.గట్టిగా అడిగితే చిల్లర మార్చుకుని వేరే బస్ ఎక్కమని చిల్లర సలహాలు ఇస్తారు. రైల్వే స్టేషన్ లో అయితే సమాధానం కూడా ఉండని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి.
అప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. వాళ్లని విజిలెన్స్ డిపార్ట్ మెంటో (Vigilance department) టక్కున వచ్చి పట్టుకుంటే పీడపోతుందనిపిస్తుంది. అలాంటి సంఘటన జరిగింది.
రూ.6 కోసం కక్కుర్తి పడిన ఓ రైల్వే క్షర్కు 26 యేండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికీ కేసు ఓ కొలిక్కిరాలేదు. అసలు ఆ క్లర్క్ కేసులో ఎలా చిక్కుకున్నాడన్నదే ఇక్క తమాషా విషయం…వివరాల్లోకి వెళితే..
రైల్వే కౌంటర్ నుంచి టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుడికి రైల్వే క్లర్క్ (Railway clerk) రూ.6 తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సస్పెండైన అతడు 26 ఏండ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ ఊరట లభించలేదు.
మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai)లో ఈ సంఘటన జరిగింది. కుర్లా టెర్మినస్ జంక్షన్ స్టేషన్‌లో రైల్వే టికెట్ క్లర్క్‌గా పనిచేసిన రాజేష్ వర్మ(Rajesh Verma), టికెట్ కొనుగోలు చేసిన ప్రయణికులకు చిల్లర డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. ప్రయాణికులను అక్రమంగా దొచుకుంటున్నాడని ఫిర్యాదులు అందాయి.
ఈ నేపథ్యంలో 1997 ఆగస్ట్ 30న విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను ప్రయాణికుడి మాదిరిగా టికెట్ కౌంటర్(Ticket counter)వద్దకు పంపారు. దూర ప్రాంతానికి టికెట్ అడిగిన ఆర్పీఎఫ్ సిబ్బంది రూ.500 నోటు ఇచ్చాడు.
టికెట్ ఛార్జీ రూ.214 తీసుకుని రూ.286 తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే చిల్లర లేదంటూ రూ.6 తగ్గించి రూ.280 మాత్రమే రాజేష్ వర్మ ఇచ్చాడు. ఆ వెంటనే విజిలెన్స్ అధికారులు కౌంటర్‌లోకి వెళ్లి తనిఖీ చేశారు. రైలు టికెట్లు అమ్మిన డబ్బుల్లో రూ.58 తక్కువగా ఉన్నట్లు గ్రహించారు.
అలాగే ఆయన వెనుక ఉన్న కబోర్డ్ లో ఉన్న రూ.480 స్వాధీనం చేసుకున్నాడు. చిల్లర లేదంటూ ప్రయాణికుల నుంచి దోచుకుంటున్న డబ్బులు అక్కడ దాస్తున్నట్టు తెలుసుకున్నారు.
మరోవైపు టికెట్ క్లర్క్ రాజేష్ వర్మపై రైల్వే శాఖ దర్యాప్తు జరిపింది.2002 జనవరి 31న అతడ్ని సస్పెండ్ చేసింది. అయితే రైల్వే చర్యను కోర్టులో సవాల్ చేశాడు. తనను సస్పెండ్ చేయడంపై చివరకు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. 26 ఏండ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.
ఏ తప్పూ చేయలేదని అతడి తరుఫు న్యాయవాది ఎంత వాదించినా ఫలితం లేకపోయింది. చివరకు తప్పు ఒప్పుకున్న రాజేష్ వర్మ, తనను క్షమించాలని, ఊరట ఇవ్వాలంటూ బాంబే హైకోర్టును అభ్యర్థించాడు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు చివరకు దీనిని తిరస్కరించింది.