కాంగో (Congo)లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈక్వెటీర్ ప్రావిన్సులో నాటు పడవ ఒకటి బోల్తా (Boat Capsized) పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి (Dead) చెందారు. 70 మందికి పైగా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. గల్లంతైన వారిని వెతికేందుకు ఘటనా స్థలానికి గజ ఈత గాళ్లను అధికారులు రప్పించారు.
ఈక్వెటర్ ప్రావిన్సులోని బందాక నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కాంగో నదిలో ఓ పడవలో సుమారు 100 మంది ప్రయాణికులు బొలాంబోకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు డిప్యూటీ ప్రావిన్షియల్ గవర్నర్ టైలర్ గాంజీ వెల్లడించారు. ఇప్పటికే 27 మృత దేహాలను వెలికి తీశామని చెప్పారు. మృత దేహాలను బందాకలోని మోర్గు జనరల్ ఆస్పత్రికి తరలించామన్నారు.
పడవ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇది ఇలా వుంటే ఈ ఘటనలో 49 మంది మరణించినట్టు కాంగోకు చెందిన న్యూ సివిల్ సొసైటీ సభ్యులు తెలిపారు. కాంగో నది మధ్యలోకి వెళ్లగానే పడవ ఇంజన్ ఆగిపోయిందని ఆ గ్రూపు ప్రెసిడెంట్ జీన్ పెర్రి వెల్లడించారు. దీంతో పడవ కాంగో నదిలో మునిగిపోయిందన్నారు.
కాంగోలో పడవ ప్రమాదాలు తరుచుగా జరగుతూ ఉంటాయి. కాంగోలో అధికంగా ఓవర్ లోడ్‌తో పడవలను నడుపుతూ ఉంటారు. అందువల్ల ఇక్కడ తరుచుగా పడవ ప్రమాదాలు జరగుతూ వుంటాయి. ముఖ్యంగా దేశంలో సరైన రోడ్లు లేక పోవడంతో వాయువ్య ప్రాంతంలోని జనాభాలో అత్యధికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పడవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.