బ్రిటీష్ (British) పాలకులను గడగడ లాడించిన యుద్దాల్లో సిపాయిల తిరుగుబాటు (Sipay Mutinee) ఒకటి. ఈ యుద్దంలో చరిత్ర లిఖించని ఎన్నో ఘటనలు కాలగర్బంలో కలిసిపోయాయి. అలాంటి ఘటనే పంజాబ్ లోని అజ్నాలాలో జరిగింది. సుమారు 500 మంది సిపాయిలు బ్రిటీష్ సైన్యాన్ని ఊచకోత కోసి ఆంగ్లేయుల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో భారతీయ సిపాయిలను అత్యంత క్రూరంగా హతమార్చి ఆ రక్తపాతం తాలుకు ఆనవాలు లేకుండా చేశారు. దుర్మార్గం ఎన్నో రోజులు దాగదు కదా… కాలంతో పాటే ఆ దారుణం తాలుకు గుర్తులు కూడా బయటకు వచ్చాయి.
బ్రిటీష్ పాలకుల దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. తవ్వే కొద్ది కాలగర్భం నుంచి బ్రిటీష్ దురాగతాల చిట్టా బయటపడుతూనే ఉంది. 2003లో అమృత సర్‌లో టౌన్ హాల్ లైబ్రరీలో దొరికిన ఓ పుస్తకరం బ్రిటీష్ పాలకుల కర్కశత్వాన్ని కండ్లకు కట్టినట్టు చూపిస్తోంది. సిపాయిల తిరుగుబాటు కాలంలో 26వ ఇన్ ఫాంట్రీకి చెందిన 282 మంది భారతీయ సైనికులపై బ్రిటీష్ క్రూరత్వానికి ‘క్రైసిస్ ఇన్ పంజాబ్’అనే పుస్తకం ఓ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
ఈ పుస్తకాన్ని అప్పటి అమృత్ సర్ డిప్యూటీ కమిషనర్ ఫెడ్రిక్ కూపర్ రచించినట్టు తెలుస్తోంది. ఈ పుస్తకంలో చెప్పిన వివరాలను ఆధారంగా చేసుకుని సురేందర్ కొచ్చర్ అనే పరిశోధకుడు ముందుకు సాగాడు. అలా ఆయన పాకిస్తాన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్నాలాలోని గురుద్వారా సింగ్ సభ క్రింద కల్లయిన్‌వాలా బావి వద్దకు చేరుకున్నాడు.
అక్కడ 2104లో బావిలో తవ్వకాలు జరపగా వందలాది మంది జవాన్ల అస్థిపంజరాలు లభించాయి. పుస్తకంలోని వివరాల ప్రకారం…. వారంత 26వ ఇన్ ఫాంట్రీకి చెందిన భారతీయ సిపాయిలు. వారందరినీ లాహోర్ సమీపంలోని మియాన్ మీర్ వద్ద మోహరించారు. 1857లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభం కావడంతో జూలై 30న ప్రకాశ్ పాండే నేతృత్వంలో సిపాయిలు బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేశారు.
బ్రిటీష్ మేజర్, సార్జెంట్ మేజర్, ఇతర బ్రిటీష్ సైనికులను భారతీయ సిపాయిలు హత మార్చి అజ్నాలా వైపునకు బయలు దేరారు. విషయం తెలుసుకున్న బ్రిటీష్ అధికారులు అజ్నాల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించారు. భారతీయ సైనికులను బందించి ఓ ఇరుకైన చీకటి గదిలో బందించారు. వారిలో 200 మంది ఊపిరాడక మరణించారు. మరో 282 మందిని కాల్చి చంపారు. ఆ మృత దేహాలతో పాటు మరికొందరిని సజీవంగా పాడుబడిన ఆ బావిలో విసిరేశారు. 2014 నుంచి బావిని కలియన్ వాలా ఖు బదులుగా అమర వీరుల బావి అని పిలుస్తున్నారు.