బిహార్ (Bihar)లో దసరా వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. గోపాల్ గంజ్ (Gopal Gunj)లో దుర్గా మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలవురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పసిపాప ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దసరా నవరాత్రుల్లో భాగంగా గోపాల్ గంజ్‌లోని ‘రాజా దళ్’ దుర్గా పూజా మండపం వద్ద వేడుకలను నిర్వహించారు. విజయదశమి సందర్బంగా మండపం వద్ద దుర్గా పూజను నిర్వహించారు. దసరా నేపథ్యంలో పూజా కార్యక్రమానికి భారీగా భక్తులు వచ్చారు. దీంతో ఒక్క సారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఓ చిన్నారి భక్తుల మధ్య కింద పడిపోయింది.
ఇది గమనించిన ఇద్దరు మహిళలు ఆ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మహిళలిద్దరకీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసుటు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. అనంతరం ఆ ముగ్గురని సదర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
దీంతో గోపాల్ గంజ్‌లో విషాద ఛాయలు అలుము కున్నాయి. ఇది ఇలా వుంటే మండపం వద్ద సరైన సెక్యూరిటీ ఏర్పాట్లు లేక పోవడంతోనే ఘటన జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. పండుగ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నా సరైన ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు, పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.