పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం (Parliament Security Breach) ఘటనపై ఉభయ సభలు దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఉభయ సభలు దద్దరిల్లి పోయాయి. భద్రతా వైఫల్యంపై చర్చ చేపట్టాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు వెల్ లోకి దూసుకు వెళ్లి ఎంపీలు ఆందోళనలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో లోక్ సభతో పాటు రాజ్యసభలు వాయిదా పడుతూ వచ్చాయి. లోక్ సభలో ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎంపీల (MP)పై సభాధిపతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలంతా ఆందోళనలు విరమించి సభాకార్యకలాపాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
కానీ ఎంపీలు ససేమేరా అన్నారు. దీంతో లోక్ సభలో ఏకంగా 31 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేతతో అధీర్ రంజన్ చౌదరితో సహా మొత్తం 31 మందిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారన్న కారణంగా వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ముగ్గురు ఎంపీలను సభాహక్కుల కమిటీ నివేదిక ఇచ్చే వరకు సస్పెండ్ చేశారు. ఆ ముగ్గురు ఎంపీల్లో కే. జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలేక్ లు ఉన్నారు. అంతకు ముందు ఈ నెల 14న 13 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ కు గురైన వారిలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకంఠన్, బెన్సీ బెహనాన్, కే. సుబ్రహ్మణ్యం, ఎస్. వెంకటేశన్, మహమ్మద్ జావెద్ లు ఉన్నారు. మరో వైపు రాజ్యసభలో ఇప్పటికే టీఎంసీ ఎంపీ డరెక్ ఓబ్రెయిన్ సస్పెండ్ అయ్యారు.