ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన మహిళల (world’s most powerful women) జాబితాను ఫోర్బ్స్ ( Forbes) విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి నలుగురు మహిళలు నిలిచారు. భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ జాబితాలో 32వ స్థానంలో నిలిచారు. ఆమె తర్వాత హెచ్ సీఎల్ కార్పొరేషన్ సీఈవో రోహిణి నాడార్ మల్హోత్ర 60వ స్థానంలో ఉన్నారు.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సోమా మండల్ 70వ స్థానంలో నిలిచారు. ఇక బయోకాన్ ఫార్మా వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 76వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో యురోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డర్ లీయెన్ అగ్రస్థానాన్ని పొందారు. రెండవ స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాస్ క్రిస్టియన్ లగార్డె నిలిచారు.
సీతారామన్ మే 2019లో భారతదేశపు మొట్టమొదటి మహిళా పూర్తికాల ఆర్థిక మంత్రి అయ్యారు. అంతకు ముందు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా ఆమె నిర్వహించారు. రాజకీయాల్లో చేరడానికి ముందు ఆమె బ్రిటన్‌కు చెందిన అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్, బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో పని చేశారు.
రోహిణి నాడార్ మల్హోత్ర హెచ్‌సీఎల్ ఫౌండర్ శివ నాడార్ కుమార్తె. హెచ్ సీఎల్ చైర్ పర్సన్‌గా ఆ కంపెనీకి చెందిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలను ఆమె తీసుకుంటూ ఉంటారు. ఇక సోమా మండల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు మొదటి మహిళా చైర్మన్ గా రికార్డు సృష్టించారు. ఇక కిరణ్ మజుందార్ షా బయోకాన్ కంపెనీ స్థాపించి దేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారని ఫోర్బ్ప్ పేర్కొంది.