దీపావళి పండుగ రోజు రాజస్థాన్ (Rajasthan)లో విషాదం చోటు చేసుకుంది. బుండి జిల్లాలో కారు(Car), ట్రక్కు (Truck) ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ నుంచి పుష్కర్ ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిపారు.
హిందోళీ పోలీసు స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 52పై వెళ్తుండగా ఓ ట్రక్కును కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మృతులను దేవీ సింగ్ (50), ఆయన భార్య మాన్ కోర్ కన్వర్ (45), రాజారాం (40), జితేంద్ర (20)లుగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
జాతీయ రహదారిపై కారు వేగంగా వెళ్తోందని హిందోళ్ సీఐ మనోజ్ సికర్వాల్ తెలిపారు. ఆ సమయంలో ముందు వెళ్తున్న ట్రక్కు సడెన్ బ్రేక్ వేసినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో ట్రక్కును కారు ఢీ కొట్టిందన్నారు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారన్నారు. మాన్ కోర్ కన్వర్ కు తీవ్రగాయాలైనట్టు చెప్పారు.
మహిళను సమీపంలోని ఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందారన్నారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడన్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మృత దేహాలకు శవపరీక్షలను నిర్వహిస్తున్నట్టు వివరించారు